
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపాదించిన అమెరికా టూర్ రద్దు కావడం.. తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారంరేపుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సీఎం పర్యటనకు అనుమతులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా.. రేవంత్ రెడ్డి తన సొంత కారణాలతోనే టూర్ రద్దు చేసుకున్నారని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగానూ ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. ఈ రాజకీయ దుమారానికి కేంద్ర విదేశాంగ శాఖ తెరదించింది. ముఖ్యమంత్రి స్థాయి ప్రముఖులు విదేశీ పర్యటనలకు రాజకీయ అనుమతి ఇచ్చే ముందు పాటించే రూల్స్ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.ఆ పర్యటన ఉద్దేశం, కార్యక్రమాల స్వరూపం, వారి పదవికి అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాలను తాము పరిశీలిస్తామని రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు. అయితే ఈసారి అమెరికా పర్యటనకు సమర్పించిన కార్యక్రమం సీఎం హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా లేదని భావించినందుకే పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించినట్లు తెలిపారు.ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు విదేశీ పర్యటనలకు సంబంధించి.. విదేశాంగ శాఖ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారికి రాజకీయ అనుమతులు విదేశాంగ శాఖ మంజూరు చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ పర్యటనకు ప్రతిపాదించిన కార్యక్రమాలు ఆయా పదవులకు, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండటం ముఖ్యమని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి అమెరికా పర్యటన విషయంలో ఆ ప్రమాణాలు సరిపోలలేదని.. అందుకే ఆ పర్యటనకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటనను అధికారులు ప్రతిపాదించారు. అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలతో విద్య, నైపుణ్యాలు, టెక్నాలజీ, భాగస్వామ్యాలపై చర్చలు జరపడం ఈ పర్యటనలో ప్రధాన ఉద్దేశంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేర్కొంది. హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ సంస్థలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకునే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. లండన్ నుంచి బోస్టన్.. ఆ తర్వాత న్యూయార్క్ సహా అమెరికాలోని పలు నగరాల్లో రేవంత్రెడ్డి పర్యటించాల్సి ఉంది.అయితే రేవంత్రెడ్డి ప్రతిపాదించిన 2 దేశాల పర్యటనలో భాగంగా అమెరికా పర్యటనకు మాత్రమే కేంద్రం రాజకీయ అనుమతి నిరాకరించింది. యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనకు విదేశాంగ శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చిందని రణధీర్ జైస్వాల్ గుర్తు చేశారు. అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడంతో సీఎం రేవంత్రెడ్డి లండన్ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లకుండా ఆగస్ట్ 23వ తేదీన హైదరాబాద్కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.అయితే.. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ రద్దు అయిన నేపథ్యంలో.. ఆ పర్యటనను పూర్తిగా నిలిపివేయకుండా, తన వెంట వెళ్లిన అధికారుల బృందాన్ని మాత్రం అమెరికా వెళ్లాలని సీఎం రేవంత్రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. ముందుగా ప్లాన్ చేసిన సమావేశాలు నిర్వహించి, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యాలు, అవగాహన ఒప్పందాల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ కారణాలతోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా విదేశాంగ శాఖ అధికారిక వివరణ ఇవ్వడంతో ఈ వ్యవహారంపై మరింత చర్చ మొదలైంది.



