
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ వరుస సినిమాలతో మళ్లీ బిజీగా మారిపోయాడు. ముఖ్యంగా ఇప్పటివరకు హీరోగానే కనిపించిన మనోజ్ మిరాయ్ సినిమాలో విలన్ గా అదరగొట్టాడు. ‘ది బ్లాక్ స్వోర్డ్’ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఇదే పాత్రకు ప్రతిష్ఠాత్మక ‘సైమా అవార్డ్స్ 2026’లో ఉత్తమ విలన్ పురస్కారాన్ని అందుకున్నాడీ రాక్ స్టార్. ఈ మేరకు మిరాయ్ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంలోనే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం విశేషమంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు మనోజ్. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి భార్య మౌనికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడీ హీరో. ‘నేను నా భవిష్యత్తును సరిగా ఊహించుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలోనే నా భార్య మౌనిక నా జీవితంలోకి వచ్చింది. తను నన్ను నమ్మింది. మిరాయ్ సినిమా షూటింగ్ సమయంలోనే నా చిట్టి దేవసేన మౌనిక కడుపులో ఉంది. నేడు ఈ ఈవెంట్లో నా భార్య పిల్లలు కూర్చుని నేను ఈ అవార్డు తీసుకోవడం చూసిన ఈ క్షణాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. అమ్మానాన్నల నుంచి నాకు సినిమా పట్ల ప్రేమ విలువలు పెరిగాయి. నా జీవితంలో ప్రతిదీ అమ్మ నాన్నల నుంచే మొదలైంది. ఇక నా కెరీర్ రూపుదిద్దుకోక ముందే నన్ను నా అక్క మంచు లక్ష్మి ఒక అమ్మలాగా నన్ను నమ్మింది. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్క అభిమానికి కూడా ఈ అవార్డు అంకితం చేస్తున్నాను’ అని రాసుకొచ్చాడు మనోజ్.




