
అందరు మాతృమూర్తుల్లానే పార్వతికి పుత్రుడు వినాయకుడంటే ఎనలేని ప్రేమ. తాను ఎంతో ఇష్టంగా తీర్చిదిద్దిన కుమారుడు కావడంతో ఆమెకు మరింత మమకారం. అందరు మాతృమూర్తుల్లానే పార్వతికి పుత్రుడు వినాయకుడంటే ఎనలేని ప్రేమ. తాను ఎంతో ఇష్టంగా తీర్చిదిద్దిన కుమారుడు కావడంతో ఆమెకు మరింత మమకారం. అయితే ఆ గణపతి పార్వతీదేవి నలుగుపిండితో తయారుచేసిన మూర్తి మాత్రమే కాదు, ఆమె శక్తి సంపత్తులు, దీక్షాదక్షతలు కూడా పుణికి పుచ్చుకున్న పుత్రరత్నం కూడా. ధీరత్వం నుంచి దయాగుణం వరకూ ఆ లంబోదరుడిలో అన్నీ తల్లిపోలికలే! సహనం నుంచి సమయస్ఫూర్తి వరకూ ఆ గణేశుడు అన్నీ ఆ ఉమాదేవి నుంచే అలవరచుకున్నాడు. సడలని పట్టుదలకి ప్రతీక పార్వతీదేవి. పరమశివుడి ఎదుట ఎన్నోమార్లు అమ్మవారిలోని ఆ లక్షణం వెలుగుచూసింది. సంకల్పించింది పూర్తిచేసుకునే వరకూ విడిచిపెట్టని దీక్ష ఆ దేవదేవిది. ఆ హైమవతి తీర్చిదిద్దిన ముద్దుల కుమారుడు గణనాథుడు కూడా ఆ సుగుణాన్నే అందిపుచ్చుకున్నాడు. వ్యాసుడు మహాభారతాన్ని రాయాలని సంకల్పించి, లేఖకుడికోసం అన్వేషించాడు. వినాయకుడే అందుకు సమర్థుడని తెలిసి సంప్రదించాడు. అంగీకరించిన గణపతికి... నేను భారతాన్ని వినిపిస్తుంటే ఆగకుండా రాయాలన్న షరతు పెట్టాడు వ్యాసుడు. నేను ఒకసారి రాయడం మొదలుపెడితే గంటం ఆగదు, మీరే ఆగకుండా కథ చెప్పాలి అని సమాధానమిచ్చాడు గణపతి. గంగా ప్రవాహ వేగాన్ని తలపించేలా వ్యాస మహర్షి చెబుతుంటే, గణపతి అంతే వడితో మహాభారతాన్ని రచించాడు. గంటం విరిగితే తన కుడి దంతాన్ని విరిచి గంటంగా ఉపయోగించి మరీ నిరాటంకంగా ఆ గ్రంథాన్ని ముగించాడు. ఏకాగ్రత, పట్టుదలల్లో తనకు తిరుగే లేదని నిరూపించాడు ఏకదంతుడు! ఏ సమయానికి ఎలా స్పందించాలో, ఎవరికి ఎలా గుణపాఠం నేర్పాలో తెలిసిన విజ్ఞురాలు ఆ విశాలాక్షి. తల్లికి ఏమాత్రం తీసిపోడు తనయుడు. ఆమెలానే సమయస్ఫూర్తిలోనూ సాటిలేనివాడు. అలకాపురిని పాలించే కుబేరుడు ముల్లోకాల్లో తనను మించిన శ్రీమంతుడు లేడని అహంభావంతో విర్రవీగుతుంటాడు. ఒకసారి దేవతలందరినీ ఆహ్వానించి తన వైభవాన్ని ప్రదర్శించాలి అనుకుంటాడు. పార్వతీపరమేశ్వరులనీ ఆహ్వానించాడు. ఆ ఆదిదంపతులు తమ తరపున బాల గణపతిని కుబేరుడి విందుకు పంపారు. ఆకలి వేస్తుందంటూ ముందే భోజన పంక్తిలో కూర్చున్నాడు బొజ్జ గణపయ్య. కుబేరుడు ఎంత వడ్డిస్తున్నా, భోజనశాలలోని పదార్థాలన్నీ వడ్డించినా వినాయకుడి ఆకలి తీరడం లేదు. అంతటి కుబేరుడు కైలాసానికి పరుగెత్తి, పార్వతీదేవిని వేడుకున్నాడు. అమ్మవారు దివ్యదృష్టితో పరిస్థితి అర్థం చేసుకొని, అలకాపురికి వెళ్లి, కొడుకు నోటిలో పిడికెడు వడపప్పు వేసింది. వెంటనే బాలగణపతి ఆకలి తీరిందంటూ లేచాడు. ఐశ్వర్యవంతుడిననే గర్వం కుబేరుడిలో అణగిపోయింది. గణనాథుడు తల్లిలా దేవతా సమూహంలో ఎవరు అహంభావాన్ని ప్రదర్శించినా సరిదిద్దే గొప్ప నాయకుడు. లోకక్షేమం కోసం భర్త గరళం తాగుతానన్నా అంగీకరించిన త్యాగమూర్తి ఆ లోకపావని. ఎదుటివారి కష్టానికి కదిలిపోయే సరళ స్వభావం కలిగిన సౌజన్యమూర్తి శివాని. ఆమె ప్రియపుత్రుడిగా గణపతి కూడా మృదుస్వభావి. సహనంలో తల్లిని మించినవాడు. ఓ పురాణ కథ ప్రకారం- బాల గణపతి ఓసారి స్నేహితులతో ఆడుకుంటూ పిల్లిని కొట్టాడు. పిల్లికి ముఖంపై చిన్న గాయమైంది. అది గమనించని గణేశుడు ఆటలో మునిగిపోయాడు. సాయంత్రం ఇంటికి రాగానే పార్వతీదేవి ఎదురుపడింది. ఆమె ముఖంపై చిన్న గాయమైంది. అది చూసి ‘అమ్మా నీ ముఖంపై ఆ గాయమేంటి’ అంటూ ఆదుర్దా, కంగారు, దిగులు నిండిన స్వరంతో ప్రశ్నించాడు వినాయకుడు. అప్పుడు ఆ శాంభవి ‘నాయనా, సర్వజీవుల్లో ఉన్నది నేనే. నువ్వు పిల్లిని గాయపరచడం వల్ల నా ముఖానికీ గాయమైంది’ అని వివరించింది. అప్పటి నుంచి ఆ విఘ్నేశ్వరుడు మనుషులనే కాదు, మూగజీవాలనూ కష్టపెట్టేవాడు కాదు. సున్నితమైన హృదయుడుగా ఎదిగాడు. ప్రకృతికి ప్రతిరూపం ఆ పరమేశ్వరి. కైలాసంలో, ఆ పరిసరాల్లో విహరిస్తూ ఆమె ఎంతో ఆనందించేదని పురాణాలు చెబుతున్నాయి. గణపతి కూడా మాతృమూర్తిలా ప్రకృతి ఆరాధకుడే. తనని పత్రాలతో పూజించిన వారి ఇంటికి పచ్చని ఆకుల తోరణమై నిలిచి ఉంటాడీ పార్వతీపుత్రుడని కీర్తించారు భక్త కవులు. తెల్ల జిల్లేడు, ఎర్రజిల్లేడు, దుర్వారయుగ్మం, జాజిపత్రం... తదితర ఇరవై ఒక్క పత్రాలతో ఆ స్వామిని పూజించడం వెనక అంతరార్థం ఆయనలోని ప్రకృతి ప్రియత్వానికి నిదర్శనం. అలాగే గణేశుడికి ద్వైమాతరుడు అనే పేరుంది. అంటే పార్వతి, గంగాదేవిల ముద్దుల తనయుడని భావం. గంగాదేవిలోని విశిష్ట గుణాలను కూడా పుణికిపుచ్చుకున్నాడా విఘ్నపతి. పవిత్రతకు ప్రతీక గంగ. గణపతి హృదయం గంగాసమానం. ఏ మాత్రం కల్మషం లేనివాడు. అందుకే నాయకత్వ స్థానంలో నిలిచి అనాదిగా పూజలందుకున్నాడు. యుగమేదయినా తల్లే పిల్లలకు ఆదర్శం. ఆమె నుంచే సకల సుగుణాలనూ వాళ్లు అలవరచుకుంటారు. ఆమె మార్గాన్నే అనుసరిస్తారు. ఆ పార్వతీగణేశుల నుంచి నేటితరం తల్లీబిడ్డలు నేర్చుకోవాల్సిందీ ఇదే! .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings





