
హైదరాబాద్ పంజాగుట్టలోని హిందూ శ్మశానవాటికలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల మృతి చెందిన ఆరు నెలల పసికందును పూడ్చి పెట్టగా.. ఆ మృతదేహం అదృశ్యమైన ఘటన సంచలనంగా మారుతోంది. ఒకే రోజు వ్యవధిలో కవల పిల్లలను కోల్పోయిన కుటుంబానికి ఈ ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. పూడ్చిపెట్టిన చిన్నారి మృతదేహం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.చార్మినార్ పరిధిలోని ఘన్సీబజార్కు చెందిన దంపతులకు 6 నెలల క్రితం కవల పిల్లలు జన్మించారు. పుట్టినప్పటి నుంచే ఆ కవలలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ కవలల్లో ఒక పసికందు శనివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు శిశువు మృతదేహాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేశారు.అయితే.. ఆ తర్వాతి రోజే ఆ కుటుంబాన్ని మరో విషాదం వెంటాడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో కవల కూడా ఆదివారం రాత్రి మృతి చెందింది. దీంతో సోమవారం కుటుంబ సభ్యులు రెండో పసికందు అంత్యక్రియల కోసం అదే శ్మశానవాటికకు వెళ్లారు. మొదటి చిన్నారిని పూడ్చిన ప్రదేశంలో గుంత తవ్వి ఉండటాన్ని వారు గుర్తించారు. ఆ గుంతలో చిన్నారి మృతదేహం కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.పూడ్చిపెట్టిన చోట తమ బిడ్డ మృతదేహం కనిపించకపోవడంతో తల్లిదండ్రులతోపాటు.. బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శ్మశానవాటిక సిబ్బందిని నిలదీస్తూ తమ బిడ్డ మృతదేహం ఏమైందని ప్రశ్నించారు. అయితే వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. శ్మశానవాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జగన్ అలియాస్ బాబా, ప్రసాద్, మల్లేష్, జోసెఫ్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.శ్మశానంలో శిశువును పూడ్చిన ప్రదేశాన్ని ఎవరు తవ్వారు.. ఎందుకు తవ్వారు, మృతదేహాన్ని ఎందుకు బయటకు తీశారు. ఇందులో శ్మశానవాటిక సిబ్బంది ప్రమేయం ఉందా.. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూఢనమ్మకాలకు సంబంధించిన అంశం ఏమైనా ఉందా అనే కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు కవల శిశువులు అనారోగ్యంతో ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడం ఇప్పటికే తీవ్ర విషాదాన్ని నింపగా.. పసికందు మృతదేహం మాయం కావడం వారిని మరింత కలచివేసింది.





