
ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (AI)తో భవిష్యత్తులో భారీ ప్రమాదం పొంచి ఉందని ఆంథ్రోపిక్‌ సీఈఓ డారియో అమోడెయ్ (Dario Amodei) సహా పలువురు టెక్‌ అధినేతలు ఇటీవల హెచ్చరికలు చేశారు. అది మరింత మెరుగవుతోన్న కొద్దీ మానవాళికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ జాబితాలో తాజాగా గూగుల్ డీప్‌మైండ్ (Google DeepMinds) మాజీ భద్రతా పరిశోధకుడు బిలాల్ చుగ్తాయ్ చేరారు. ఏఐ ఆందోళనతో అతడు ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గూగుల్‌ ఏజీఐ సేఫ్టీ బృందం కీలక సభ్యుడు జాష్‌ ఎంగెల్స్‌ సైతం ఆయన స్థానం నుంచి వైదొలిగారు. ‘ఆరంభ సమయంలో ఏఐ (AI) ఓ హాస్యాస్పదమైన విషయంగా ఉండేది. కేవలం నాలుగేళ్లలోనే ఓపెన్‌ ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్ల సమూహాలు తమను తాము మరింత మెరుగుపరుచుకున్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ప్రస్తుతం అవి ఓపెన్‌ ఏఐ నియంత్రణ నుంచి తప్పించుకుని.. సొంతంగా థర్డ్‌ పార్టీ కంపెనీలను హ్యాక్‌ చేస్తున్నాయి. రానున్న ఐదేళ్లలో కృత్రిమ మేధతో తీవ్ర నష్టాలు ఎదుర్కొనే అవకాశముంది. దానికి మనందరినీ అంతం చేసే సామర్థ్యముంది. గూగుల్‌లో ఏఐ అభివృద్ధిని నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ అసాధారణ పెరుగుదల చూస్తుంటే ఆందోళనగా ఉంది. ఏఐ నుంచి వచ్చే విపత్తును ఎదుర్కోవడానికి కూడా సమయం లేని దశకు మనం చేరుకున్నాం’ అని బిలాల్ చుగ్తాయ్ పేర్కొన్నారు. ఏఐ గురించి జోష్‌ ఏంగెల్స్‌ మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లలో మనం ఊహించని స్థాయిలో ఏఐ వ్యవస్థలు హాని తలపెట్టే అవకాశముందని హెచ్చరించారు. అందువల్లే ఆధునిక AI మోడళ్ల సామర్థ్యాలను.. వాటి నుంచి పొంచి ఉన్న ప్రమాదాలను అంచనా వేసే మోడల్ ఎవాల్యుయేషన్ అండ్ థ్రెట్ రీసెర్చ్ (METR) అనే పరిశోధనా సంస్థలో చేరినట్లు తెలిపారు. కృత్రిమ మేధ నుంచి వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ఇటువంటి సంస్థలు మరిన్ని ఉండడం అవసరమని పేర్కొన్నారు. దీనిని కట్టడి చేయాలంటే అన్ని ఏఐ కంపెనీలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





