
ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తనను అదుపులోకి తీసుకున్నారని.. కొన్ని గంటల తర్వాత విడుదల చేశారని కేరళం రాష్ట్రానికి చెందిన మహిళా ట్రావెల్ వ్లాగర్ (travel vlogger) పేర్కొన్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో పర్యటిస్తోన్న వ్లాగర్‌ అరుణిమ (Arunima) తాను తాబిబన్ల అదుపులో ఉన్నానని .. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడానికి సాయం చేయాలని కోరుతూ సోమవారం సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. అధికారిక అనుమతి పత్రం లేకపోవడంతో వారు తనను అదుపులోకి తీసుకున్నారన్నారు. మూడు గంటల తర్వాత.. తాలిబన్లు తనను వదిలేశారని పేర్కొన్నారు. ‘‘అఫ్గాన్‌ ( Afghanistan ) చట్టం ప్రకారం, ఒక మహిళ ఒంటరిగా ప్రయాణించకూడదు’ అని బామియాన్‌లోని అధికారులు నాతో అన్నారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించడానికి అనుమతి లేని దేశానికి రావడమే నేను చేసిన నేరం. ఇక్కడ ప్రతి ప్రావిన్స్‌కు ఒక అనుమతి పత్రం చూపించాలి. గైడ్‌ కూడా లేకుండా నేను ఒక్కదాన్నే ప్రయాణిస్తున్నందున గతంలో జలాలాబాద్‌లో అధికారులు అనుమతి పత్రం ఇవ్వలేదు. అందువల్లే నా వద్ద ఆ పత్రాలు లేవు. ఇక్కడి నుంచి ప్రాణాలతో బయపడతానని అనుకోలేదు. కాళ్లు పట్టుకొని బతిమాలితే కానీ వారు వినలేదు. దీంతో నేను బామియాన్‌కు చేరుకోవడానికి సాయం చేసిన వ్యక్తిని సంప్రదించాను. ఆ వ్యక్తి అధికారులతో మాట్లాడి, నచ్చజెప్పడంతో వారు నన్ను వదిలేశారు. కేవలం మహిళనైనందునే ఈ సమస్యలు ఎదురయ్యాయి. గతంలోనూ నా స్నేహితుల్లోని కొందరు యువకులు అఫ్గాన్‌కు వచ్చారు. వారెవరూ ఇటువంటి సమస్యలు ఎదుర్కోలేదు’ అని ఆమె పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.