
బంగారం ధరల్లో ప్రస్తుతం ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, అమెరికా సుంకాల క్రమంలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగడం లేదు. ప్రస్తుతం గోల్డ్ రేట్లు స్వల్పంగా పుంజుకుంటున్నాయి. రోజుకోకలా ధరలు కొనసాగుతుండటంతో భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది పెద్ద చర్చనీయాశంగా మారింది. ఈ క్రమంలో ధరలపై ఎవరి అంచనాలువారే వేసుకుంటున్నారు. కొంతమంది పెరుగుతుందని అంటుండగా.. మరికొంతమంది తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ బిజినెస్ అనలిస్టుల అభిప్రాయంగా కూడా భిన్నంగా ఉంది. అయితే బంగారం ధరలపై ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను ఎక్స్ వేదికగా వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి పసిడి ధరలపై చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. బంగారానికి డిమాండ్, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను విశ్లేషిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.





