

China Slams US Weapons in Space : అంతరిక్షంలో యుద్ధం.. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే, వినిపించే మాట ఇది. అలాంటి యుద్ధాలే నిజంగా జరగబోతున్నాయా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. నింగి, నేలే కాదు.. ఏకంగా అంతరిక్షం కూడా రాబోయే రోజుల్లో యుద్ధ క్షేత్రాలుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. అంతరిక్షంలో ఆయుధాలు మోహరించామంటూ అమెరికా చేసిన ప్రకటన.. ప్రపంచవ్యాప్తంగా కొత్త భయాలు క్రియేట్ చేస్తోంది. అమెరికా ప్రకటనపై చైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
నింగిలో తమ సైనిక బలాన్ని ప్రదర్శిస్తూ అమెరికా మిలిటరీ చరిత్రలోనే ఒక సంచలన ప్రకటన చేసింది. అంతరిక్ష కక్ష్యలో శత్రు దేశాల దాడులను తిప్పికొట్టే అధునాతన ఆయుధాలను అమర్చినట్లు అమెరికా రక్షణ శాఖ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. అంతరిక్షంలో చైనా, రష్యా దేశాలు.. సైనిక కదలికలను ముమ్మరం చేస్తున్న వేళ, అగ్రరాజ్యం చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. విశ్వంలో తమ ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా అమెరికా వేసిన ఈ అడుగు.. రాబోయే రోజుల్లో కొత్త రకం అంతరిక్ష యుద్ధానికి దారి తీసే పరిస్థితులకు కారణం అవుతుందనే భయాలు వినిపిస్తున్నాయి.
అంతరిక్షంలో తాము ఆయుధాలను మోహరించినట్లు అమెరికా స్పేస్ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్ వెల్లడించారు. శత్రుదేశాల బెదిరింపుల నుంచి అమెరికా, మిత్ర దేశాలను సమర్థంగా కాపాడేందుకు కక్ష్యలో ఉన్న ఈ ఆయుధాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఏ రకమైన ఆయుధాలను అమెరికా అక్కడ మోహరించిందో మాత్రం వెల్లడించలేదు. అమెరికా స్పేస్ ఫోర్స్ కమాండ్.. ముఖ్యంగా చైనా, రష్యాను అంతరిక్షంలో ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తోంది. అయితే, అమెరికా తీరుపై రష్యా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతరిక్షంలో అమెరికా ఆయుధాలను మోహరించడంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చే చర్యలను నిలిపివేయాలని అమెరికాను కోరింది. అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను పెంచడం వల్ల అంతర్జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని బీజింగ్ హెచ్చరించింది. అంతరిక్షం శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగపడాల్సిన ప్రాంతమని, దానిని యుద్ధభూమిగా మార్చకూడదని పేర్కొంది. అంతరిక్షంలో ఆయుధాల మోహరింపు మరింత పెరిగితే ఆయుధ పోటీకి దారితీసే అవకాశాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా మాత్రం తన అంతరిక్ష ఆధారిత ఆయుధ సామర్థ్యాలను ప్రధానంగా రక్షణాత్మక, నిరోధక చర్యలుగా వివరిస్తోంది. శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పుల నుంచి అమెరికా అంతరిక్ష ఆస్తులను రక్షించడమే లక్ష్యమని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామంతో అంతరిక్షంలో సైనిక సామర్థ్యాల పెంపుపై అంతర్జాతీయ స్థాయిలో చర్చకు తెరలేచింది.