© 2026 nimisham.in

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. GO 25 Problems: నల్గొండ-హైదరాబాద్-ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డిని కలిసిన ఉపాధ్యాయులు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ (SGT)లు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్యా వ్యవస్థకు పునాది వంటి ప్రాథమిక పాఠశాలల పరిరక్షణకు, మౌలిక వసతుల కల్పనకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బడులు మూతపడకుండా కాపాడుకోవడంతో పాటు ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను శాసనమండలి వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బ్రతికించుకోవడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు (SGT) విజ్ఞప్తి చేస్తున్నారు. జీఓ నెంబర్ 25 వల్ల ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 1 నుండి 5 తరగతుల్లో 20 మంది విద్యార్థులు ఉంటే ఒక్కరినే ఉపాధ్యాయుడిగా ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 4,800 పాఠశాలలు ఒక్క టీచర్‌తోనే నడుస్తున్నాయని వాపోతున్నానరు. 21 నుండి 60 మంది పిల్లలు ఉంటే ఇద్దరు టీచర్లను ఇస్తున్నారు. కానీ, ఇద్దరు టీచర్లు ఒకే సమయంలో ఐదు తరగతులకు పాఠాలు చెప్పడం అసాధ్యంగా మారింది. దీనినే బహుళ తరగతి బోధన అని పిలుస్తున్నప్పటికీ, ఆచరణలో ఇది విఫలమవుతోందని.. దీనివల్లే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,100 పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం: పాఠాలు చెప్పడంతో పాటు ఉపాధ్యాయులపై ప్రభుత్వం తీవ్రమైన బోధనేతర భారం మోపుతోందని వాపోతున్నారు. ప్రతిరోజూ యాప్‌లలో విద్యార్థుల, ఉపాధ్యాయుల
హాజరు నమోదు, మధ్యాహ్న భోజనం, రాగిజావ పర్యవేక్షణ, U-DISE ప్లస్ అప్డేషన్, పరీక్షల నిర్వహణ, మార్కుల నమోదు, పుస్తకాలు-యూనిఫాంల పంపిణీ, ఎన్నికల విధులు వంటి పదుల సంఖ్యలో పనులను బోధనా సమయంలోనే చేయాల్సి వస్తోందని ఉపాధ్యాయులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
తరగతికో టీచర్ పరిష్కారం: ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలంటే FLN కు ఎంపికైన 5,400 పాఠశాలలకు క్లస్టర్ వారీగా తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని, ప్రధానోపాధ్యాయులను కేటాయించి పాఠశాలల విలీనం (Merging) చేయడమే సరైన మార్గమని సూచిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలల విలీనంపై సానుకూల ప్రకటన చేసినందున, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాల నాయకులు స్పందించి ప్రభుత్వానికి సరైన సూచనలు చేయాలని ఎస్జీటీ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాలల విలీనంతో పాటు విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి, డిజిటల్ బోధన అందించడం ద్వారా మాత్రమే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాది పడితేనే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయమవుతుందని, ప్రభుత్వం తక్షణమే ఈ సమస్య తీవ్రతను గుర్తించాలని కోరుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడకుండా చూడటం, ఉపాధ్యాయులపై బోధనేతర పనుల ఒత్తిడిని తగ్గించి పూర్తిస్థాయిలో బోధనకే ప్రాధాన్యతనిచ్చేలా నిబంధనలు సవరించడం అత్యవసరమని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూ, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ లోకం ఆశిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.