
స్వార్థం మానవత్వాన్ని హరిస్తుందంటారు. హాగర్‌కు జరిగిన అన్యాయం అందుకు నిదర్శనం. హాగర్‌ అంటే పలాయనం. ఈ పేరు వినగానే పారిపోతున్న తల్లీ పిల్లా గుర్తుకు వస్తారు. ఈ పేరే ఒక సంచలనం. ఈజిప్టుకు చెందిన ఈమె.. అబ్రహాం భార్య శారాకు సహాయకురాలు. ఎంతో అందంగా, చలాకీగా ఉంటుంది. శారాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలుస్తుంది. అబ్రహాంని వృద్ధాప్యం ఆవరిస్తోంది. సంతానం లేక తన వంశం అంతరిస్తుందేమోని దిగులు చెందుతున్నాడతడు. ఒకరోజు శారా సహాయకురాలైన హాగర్‌ని అలంకరించి ‘ఈ రాత్రి నువ్వు అయ్యగారి గదికి వెళ్లాలి’ అని పంపింది. ఇప్పుడు ఆశ్చర్యం కలిగించినప్పటికీ.. ఆ కాలంలో ఇలాంటివి జరుగుతుండేవి. అబ్రహాం, హాగర్లు ఒకటయ్యారు. ఫలితంగా ఇస్మాయిల్‌ పుట్టాడు. ఇస్మాయిల్‌ను కన్నతల్లిలా పెంచుతోంది శారా. కొన్నాళ్లకు శారా కూడా సంతానవతి అయ్యింది. ఇస్సాకు జన్మించాడు. శారా ఇస్మాయిల్‌ను దూరంపెట్టి, ఇస్సాకును మాత్రమే ప్రేమగా చూడసాగింది. ఇద్దరు పిల్లలూ కలిసిమెలిసి తిరగడం, ఆడుకోవడం, అబ్రహాం ప్రేమను పిల్లలిద్దరూ సమానంగా పంచుకోవడం వంటి దృశ్యాలు శారాకు నచ్చలేదు. ఒకప్పుడు తనే తన భర్త వద్దకు పంపిన శారాకి.. ఇప్పుడు హాగర్‌ అల్పురాలిగా కనిపించసాగింది. ‘నువ్వెక్కడ, నేనెక్కడ?’ అనుకుని ఆమెని తరిమికొట్టింది. బిడ్డను చేతబట్టుకొని కట్టుబట్టలతో కొండకోనలు దాటుతూ ఒంటరిగా పయనిస్తున్న హాగర్‌కు.. దేవుడు, దేవదూతలు అనేక విధాల సాయంచేశారు. వారి ద్వారా అద్భుతాలు జరిగాయి. ఇస్మాయిల్‌- మహ్మద్‌గా.. అంటే అరబ్బులకు పూర్వీకుడు కాగా; ఇస్సాకు- క్రీస్తుకు పూర్వీకుడయ్యాడు. ఇంతటి వైరుధ్యానికీ, చీలికకూ కారణం శారాలోని అహంకారం, స్వార్థం- అనేది పైకి కనిపిస్తున్న కారణం. కానీ వారివల్ల లోకానికి మేలు జరగటం అందులోని పరమార్థం. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




