
స్థలపురాణ కథనం ప్రకారం.. దేవీ ఉపాసకుడు, సంస్కృత పండితుడు అయిన భాస్కరరాయలు శ్రీరామనాథస్వామిని దర్శించుకునేందుకు రామేశ్వర క్షేత్రానికి వెళ్లాడు. దర్శనానంతరం ఆలయం బయటకు రాగా.. ఒక వ్యక్తి తీవ్ర స్వరంతో- ‘ఇక్కడి శివలింగాన్ని మట్టి, ఇసుకలతో రూపొందించారని చెబుతున్నారు. ఒకవేళ ఆ మాట నిజమైతే.. అనేకానేక సంవత్సరాలుగా.. ప్రతి నిత్యం చేస్తున్న అభిషేకాలకు.. లింగం కరిగిపోకుండా ఇంకా ఉంటుందా? ఇదంతా వట్టి బూటకం’ అని హేళన చేస్తుంటే.. రెండో వ్యక్తి అదే నిజం అంటున్నాడు. భాస్కరరాయలు వారి సందేహాన్ని నివృత్తి చేయాలనుకున్నాడు. వారిలో ఒక వ్యక్తిని పిలిచి.. కొద్దిగా ఉప్పు తెమ్మంటే.. అతడు తెచ్చాడు. భాస్కరరాయలు ఆ ఉప్పుతో వారి సమక్షంలోనే ఒక శివలింగం తయారుచేసి ప్రార్థించాడు. ఆ వెంటనే ‘మీలో ఎవరైనా ఈ లింగానికి అభిషేకం చేయండి’ అన్నాడు. వారిలో ఒక వ్యక్తి ముందుకొచ్చి.. జలంతో అభిషేకం చేసినా.. లింగం కరగలేదు. అప్పుడు భాస్కరరాయలు ‘ఈ పుణ్యక్షేత్రం మహిమాన్వితమైందని తెలుసుకుని, మీ ధోరణి మార్చుకోవాలి. ఈ ఉప్పు మీరు తెచ్చిందే కదా! ఒకవేళ నేను తెచ్చి ఉంటే.. అందులో నేనేదో కలిపి గమ్మత్తు చేశానని భావించేవారు. అందుకే ఆ పని మీకే అప్పగించాను. నేనొక అతి సామాన్య ఆధ్యాత్మికవాదిని. ఉప్పుతో లింగం రూపొందించి, నాకు తెలిసిన పద్ధతిలో స్తుతించాను. ఆ మాత్రానికే లవణ లింగం కరగలేదు. అలాంటిది కారణజన్ములైన సీతారాములు భక్తితో రూపొందించిన శివలింగం కరిగిపోతుందని ఎలా అనుకున్నారు?’ అంటూ ఉదాహరణపూర్వకంగా తెలియజేశాడు. అంతటితో వారికి జ్ఞానోదయమైంది.. భాస్కరులను క్షమించమని ప్రార్థించారు. ఆయన దైవమహిమను చులకన చేయొద్దని ఉపదేశించి.. మూలవిరాట్టుకు వెనుక గోడలో, లింగోద్భవమూర్తికి ఎదురుగా దాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు నేటికీ ఈ లింగాన్ని దర్శించుకోవచ్చు. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




