
ఆ దిశగా పశువైద్యవర్సిటీ అధ్యయనం ఈనాడు,హైదరాబాద్‌: ముర్రా, గిర్, సాహివాల్, రెడ్‌ సింధీ, ఒంగోలు, పుంగనూరు దేశంలో పేరొందిన ఆవుజాతులు. ముర్రా, జాఫరాబాదీ పేరొందిన గేదె జాతులు. ఇప్పుడీ జాబితాలో తెలంగాణ పశుసంపద కూడా చేరనుంది. రాష్ట్రంలోని ఆవులు, గేదెలు, మేకలు, ఇతర పశువులను కాపాడి..వాటికి బ్రాండింగ్‌ తెచ్చేందుకు పీవీ నరసింహారావు రాష్ట్ర పశువైద్యవిశ్వవిద్యాలయం పూనుకుంది. వర్సిటీ పశు జన్యు విభాగం (యానిమల్‌ జెనెటిక్స్‌) దీనికి అవసరమైన కసరత్తు పూర్తి చేసింది. త్వరలో నమోదు ప్రక్రియ చేపట్టనుంది. తెలంగాణలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పాడి, మాంసోత్పత్తితో కీలకపాత్ర పోషించే పశువుల సంఖ్య యేటా తగ్గుతోంది. ఈనేపథ్యంలో పశువైద్యవర్సిటీ జన్యు విభాగం తెలంగాణ రాష్ట్ర పశుసంపదను కాపాడటంతో పాటు ఆయా పశువుల ప్రత్యేకతను ప్రపంచానికి చాటేలా ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. ఏడాది క్రితం ఆచార్య ఏకాంబరం ఆధ్వర్యంలో అధ్యయనం చేపట్టింది. పశువైద్య వర్సిటీ జెనెటిక్‌ విభాగాధిపతి బి.ఏకాంబరం నేతృత్వంలోని పశువైద్య శాస్త్రవేత్తల బృందం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి అక్కడి ఆవులు, గేదెలు, ఎద్దులు, మేకలు, గొర్రెలను పరిశీలించి వాటి చరిత్ర, జన్యు సమాచారం, వంశపారంపర్యం, వైవిధ్యం వంటి సమాచారాన్ని సేకరించింది. గ్రామాలవారీగా పశువుల సంఖ్య, వాటి ఆకారాలు(రంగు, బరువు, కాళ్లు, దేహం, తల, చెవులు, కనులు, కనురెప్పలు, కొమ్ములు, తోక), లక్షణాలు, ఉపయోగం, శ్రమ, ఉత్పత్తులు, వాటిపై ఆధారపడినవారి సంఖ్య, ఉపాధి ఇతర అంశాలను తీసుకున్నారు. ఈ సమాచార క్రోడీకరణ జరుగుతోంది. డాక్యుమెంటేషన్‌ తర్వాత వాటిని ఎన్‌బీఏజీఆర్‌ (జాతీయ పశు జన్యు వనరుల సంస్థ)లో నమోదు చేయనున్నారు. గతంలో తెలంగాణలోని డెక్కనీ గొర్రెలను ఇలా నమోదు చేశారు. ఎన్‌బీఏజీఆర్‌ పశువుల జన్యు సమాచారంతో పాటు ఇతర విశిష్టతలను తెలియజేస్తూ పశువులకు జీఐ గుర్తింపు సంఖ్యను ఇస్తుంది. దీంతో వాటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పెంపకందార్లను ప్రోత్సహిస్తుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న తెలంగాణ పశుసంపద ఖ్యాతిని ప్రపంచానికి తెలిపేందుకు కృషి చేస్తున్నామని పశువైద్యవర్సిటీ జెనెటిక్‌ విభాగాధిపతి ఏకాంబరం తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





