
హిందూ సంప్రదాయంలో గణేష్ చతుర్థి పండుగకు ఎంతో విశిష్టత ఉంది. భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి నాడు వినాయకుడు జన్మించాడని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే, పూజ చేసేటప్పుడు వాస్తు శాస్త్ర నియమాలను పాటించడం చాలా ముఖ్యం. కొన్ని వస్తువులను వినాయకుడి విగ్రహం దగ్గర పెడితే ఇంట్లో శాంతి, సంతోషాలు కరువవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వినాయక పూజ సమయంలో ఏ పొరపాట్లు చేయకూడదో ఇక్కడ చూద్దాం...
తులసి ఆకులు: పురాణాల ప్రకారం వినాయకుడి పూజలో తులసిని అసలు ఉపయోగించకూడదు. విగ్రహం దగ్గర గానీ, ఆయనకు సమర్పించే నైవేద్యంలో గానీ తులసి ఆకులు ఉండకుండా చూసుకోవాలి.
తోలు వస్తువులు: లెదర్ లేదా తోలుతో చేసిన పర్సులు, బెల్టులు, బూట్లు, చెప్పులు వంటి ఏ వస్తువును కూడా వినాయకుడి పూజా గదిలో లేదా వినాయకుడి విగ్రహం దగ్గర ఉంచకూడదు. వీటిని అపవిత్రంగా భావిస్తారు.
చెత్తబుట్టలు, చీపుర్లు: వినాయకుడి పూజా స్థలంలో ఎప్పుడూ పరిశుభ్రత ఉండాలి. విగ్రహం చుట్టూ చెత్తబుట్టలు, చీపుర్లు లేదా పనికిరాని వస్తువులు ఉంచితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని నమ్ముతారు.
హింసాత్మక చిత్రాలు: వినాయకుడి మందిరంలో లేదా వినాయక విగ్రహం దగ్గర ఎలాంటి ప్రతికూల, హింసాత్మక లేదా బాధాకరమైన ఫోటోలు, చిత్రాలను పెట్టకూడదు. ఇవి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని తెచ్చి శాంతికి భంగం కలిగిస్తాయి. ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ వినాయకుడిని పూజిస్తే ఇంట్లో సుఖసంతోషాలతో పాటు సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.






