
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు మల్లేష్ ను శుక్రవారం ( సెప్టెంబర్ 11 ) అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలంటూ సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మల్లేష్ ను పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు.సెప్టెంబర్ 15 నుంచి మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు.
ఈ కేసుకు సంబంధించి మల్లేశ్‌తో పాటు కేసులోని ఇతర నిందితులను కలిపి విచారించనున్నారు పోలీసులు. ఆయుధాల చోరీ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌పై ఆరా తీయనున్నారు. పోలీసుల విచారణలో మల్లేశ్ వెల్లడించే వివరాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.
చోరీ చేసిన ఆయుధాలను ఎవరికి అప్పగించాలని అనుకోన్నాడనే కోణంలో విచారణ చేయనున్నట్లు తెలిపారు పోలీసులు. మల్లేశ్ చెప్పే కీలక వివరాలను ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థలకు అందించనున్న రాష్ట్ర పోలీసులు.
దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఉగ్రకోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు మల్లేశ్ వినియోగించిన వాట్సాప్ డేటాను రిట్రీవ్ చేయడంతోపాటు, సోషల్ మీడియా అకౌంట్లు, గత ఆరు నెలల కాల్ హిస్టరీ డేటాను సేకరిస్తున్నారు. అందుకోసం మొబైల్ ఫోన్ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు పంపించారు.
ప్రధానంగా జూన్ 30న ఉద్యోగంలో నుంచి తొలగించిన నాటి నుంచి మల్లేశ్ కదలికలు ఎలా ఉన్నాయి ? దొంగిలించిన ఆయుధాలను ఎక్కడికి తరలించేందుకు పథకం రచించాడు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఇటీవల కాలంలో మల్లేశ్ తో పరిచయం పెంచుకున్న కొత్త వ్యక్తులు, స్నేహితుల్లో నేరచరిత కలిగిన వారి గురించి ఆరా తీస్తున్నారు. మద్రాస్ రెజిమెంట్ నుంచి పనిష్మెంట్ కింద గతంలో డిస్మిస్ అయిన ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగుల వివరాలను కూడా సేకరిస్తున్నారు.






