
మెదక్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ) : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలందరికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్ని తొలగిపోయి, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. bజిల్లా ప్రజలందరూ గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా, ఐకమత్యంతో జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. గణపతి ఆశీస్సులతో జిల్లాలో శాంతి, సౌభాగ్యం నెలకొనడంతో పాటు ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని ఆకాంక్షించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి గణేశ్ విగ్రహాలను వినియోగించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ఉపయోగించకుండా, నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా స్వచ్ఛత, క్రమశిక్షణ పాటిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని తెలిపారు. నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. ప్రజలందరూ పరస్పర సహకారంతో, ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు.
