
అసలుపేరు స్థానంలో పరదాల మణిగా ప్రసిద్ధి తిరుమలలో కుటుంబ సభ్యులతో పరదాల మణి తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: అతనో సాధారణ దర్జీ, ప్రతినిత్యం టైలరింగ్‌ చేస్తూ జీవనోపాధి సాగించే సాదాసీదా మనిషి. కానీ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పుట్టి పెరగడాన్ని అదృష్టంగా భావించాడు. కలియుగ వైకుంఠవాసుడైన తిరుమల శ్రీవారికి తనకు చేతనైన రీతిలో భక్తిని చాటుకోవాలనుకున్నాడు. ఆ ఆలోచనే అతడిని ప్రత్యేకమైన సేవకు పురిగొల్పింది. అలా దాదాపు 28 ఏళ్లుగా స్వామివారి సేవలో తనవంతు భక్తిని చాటుకుంటున్నాడు. అతనే మేకల సుబ్రహ్మణ్యం అలియాస్‌ పరదాల మణి. తిరుమల శ్రీవారికి నిర్వహించే ముఖ్యమైన పర్వదినాలను పురస్కరించుకుని మేలిమి వస్త్రాలతో పరదాలు, కురాళాలను స్వయంగా రూపొందిస్తున్నారు మణి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివారి ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు తదితర విశేష సందర్భాల్లో తన సేవను కొనసాగిస్తున్నారు. గోవిందమాల ధరించి భక్తిశ్రద్ధలతో తయారు చేసే ఈ వస్త్రాలను శ్రీవారి వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. శ్రీవారి ఆలయంలోని గర్భాలయం, కులశేఖరపడి, శయన మండపం, సుప్రభాత సేవ, రాములవారి మేడ, ఏకాంత సేవ తదితర సందర్భాల్లో ఉపయోగించే పరదాలు, కురాళాలను మణి భక్తితో రూపొందిస్తున్నారు. వస్త్రం ఎంపిక నుంచి ఆకృతి, అలంకరణ వరకు ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్వామివారి ఆలయ విశిష్టత, వైభవం ప్రతిబింబించేలా చూస్తారు. తాను తయారు చేసిన పరదాలు, కురాళాలను నేరుగా స్వామివారి సన్నిధికి తీసుకెళ్లడానికే మణి ప్రాధాన్యం ఇస్తారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ముందురోజు అలిపిరి వద్దనున్న పాదాల మండపం వద్ద వాటికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. అక్కడ బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆలయ అధికారులు, అర్చకులకు అందజేస్తారు. శ్రీవారి సేవతోపాటు తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని పలు ఆలయాలకు కూడా మణి తన సేవలను అందిస్తున్నారు. ఈ పుణ్యకార్యంలో తనతోపాటు కుటుంబ సభ్యులంతా భాగస్వాములవుతున్నారని, ఇప్పటివరకు శ్రీవారి ఆలయంతోపాటు వివిధ ఆలయాలకు ఐదు వేలకుపైగా పరదాలు, కురాళాలు సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





