
హైదరాబాద్, సెప్టెంబర్ 15: సెప్టెంబర్ 17 వ తేదీన హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ఉపరాష్ట్రపతి సి.పీ. రాధా కృష్ణన్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, పోలీసు అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ.. ఈనెల 17 న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిం చే తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలోముఖ్య అతిధిగా పాల్గొనడానికి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ వస్తున్నారని తెలిపారు. 17 న ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకొని ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖలు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నాయని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, హైదరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్లు సజ్జనార్, సుమతి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.