ఏపీలో సీ ప్లేన్ సేవలు

పది చోట్ల వాటర్డ్రోమ్ నిర్మాణం

కేంద్రం పచ్చజెండా ఉడాన్ నిధులు

AP Tourism: ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తూ, జల మార్గంలో విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ప్రాతిపదికన ఈ ప్రతిష్టాత్మక సీ ప్లేన్ ప్రాజెక్టును అమలు చేయనుండగా, ఇది రాష్ట్ర పర్యాటక రంగానికి సరికొత్త ఊపునిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

TTD Board: శ్రీవారి భక్తులకు బీమా.. దేశంలోనే తొలిసారిగా.. టీటీడీ సంచలన నిర్ణయం

పది ప్రసిద్ధ ప్రాంతాల్లో వాటర్డ్రోమ్లు.. ఒక్కో దానికి రూ. 20 కోట్ల వ్యయం:

ఈ ప్రాజెక్టులో భాగంగా విజయవాడ బెర్మ్ పార్క్, శ్రీశైలం, విశాఖపట్నం, గండికోట, లంబసింగి తాజంగి రిజర్వాయర్, పోలవరం సహా 10 ప్రధాన పర్యాటక ప్రాంతాలను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సీ ప్లేన్లు సురక్షితంగా నీటిపై దిగేందుకు, ఎగిరేందుకు వీలుగా ఒక్కో ప్రాంతంలో దాదాపు రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక వాటర్డ్రోమ్లు నిర్మించనున్నారు. త్వరలోనే ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) వీటి నిర్మాణ పనుల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించేందుకు సన్నాహాలు చేస్తోంది.

మొదటి దశలో కీలక రూట్లు.. ఉడాన్ పథకం కింద కేంద్ర ఆర్థిక సహాయం:

తొలి దశలో పర్యాటకుల(AP Tourism) రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ, శ్రీశైలం, విశాఖ, లంబసింగి వంటి ప్రాంతాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే విజయవాడ నుంచి శ్రీశైలానికి నిర్వహించిన సీ ప్లేన్ ట్రయల్ రన్లో సీఎం చంద్రబాబు స్వయంగా ప్రయాణించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్’ పథకం కింద ఆర్థిక సహకారంతో పాటు ఆపరేటర్లకు నష్టం రాకుండా వీజీఎఫ్ (VGF) రక్షణ కూడా లభించనుంది. గుజరాత్, కేరళ సరసన ఇప్పుడు ఏపీ కూడా చేరనుంది.