
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మూల్యాంకనంతో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులను బలి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 మూల్యాంకనంతో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులను బలి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు ఇవాళ (గురువారం) మధ్యాహ్నం లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్-1 అంశం చర్చకు వచ్చింది. గ్రూప్-1 మూల్యాంకనంలో 97 శాతం జవాబు పత్రాలు దిద్ది ఉండటంపై సీఎం చంద్రబాబు, మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో జవాబు పత్రాలు దిద్దించడంపై పలు పత్రికలు, ఛానళ్లలో వచ్చిన వార్తలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని సీఎంకు మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ గ్రూప్-1 వ్యవహారంపై వైసీపీని ఎండగట్టాలని సీఎంను కోరారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత వైసీపీ ప్రభుత్వం, అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు పాత్రపై మరింత లోతైన దర్యాప్తు చేయాలని మంత్రులు పేర్కొన్నారు. మరికొంతమంది అధికారుల పాత్రా ఉందని, దీనిపైనా దర్యాప్తు జరపాలని చంద్రబాబుకు మంత్రులు విజ్ఞప్తి చేశారు. 2011లో మహారాష్ట్రలోనూ ఇలానే జరిగితే అక్కడ అభ్యర్థులు పోరాటం చేశారని మంత్రులు గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. సిట్ నివేదిక కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం నిర్ణయం ఏమిటో చూద్దామని మంత్రులకు సూచించారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై సమాచారం సేకరించేందుకు కొంతమంది పోలీస్ శాఖ అధికారులకు ప్రభుత్వం టాస్క్ ఇచ్చిందన్నారు. తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థులతో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు