
కమలానగర్: అనంతపురం నగరంలో రూ.107.71కోట్లతో కీలక ప్రాజెక్టులను ఇన్‌ఛార్జి మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. నగరంలో తాగునీరు, మురుగునీటి వ్యవస్థల ఆధునికీకరణలో భాగంగా రెండు భారీ అమృత్ 2.0 పథకాల పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్సీ రమాదేవి, తెదేపా నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నగరంలోని పాతవూరులోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంక్ కాంపౌండ్ ఆవరణలో ఈ పనుల ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. నగరంలో తాగునీటి సరఫరాలో ఉన్న అంతరాలను పూర్తిగా తొలగించి.. ప్రతి ఇంటికీ సమర్థవంతంగా నీటిని అందించడంతో పాటు, నూతన వాటర్ ట్యాంక్‌లు, భారీ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ.. తాగునీరు, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఈ పనులు చేపట్టామన్నారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. అమృత్ 2.0 పథకం ద్వారా నీటి సమస్య లేకుండా చేస్తున్నందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. అసలు అనంతపురానికి ఎక్కడా తాగునీటి సమస్య ఉండదన్నారు. మురుగునీరు శుద్ధి చేసేలా 25 ఎం.ఎల్.డి ప్లాంట్‌ను తీసుకొచ్చారన్నారు. ప్రజలంతా ఈ రెండేళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది? ఎవరు చేశారన్నది గుర్తించాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొరుపాటున వైకాపాని గెలిపిస్తే.. అభివృద్ధి ఆగిపోతుందన్నారు. వారికి కేవలం డబ్బు, పదవులు మాత్రమే ముఖ్యమని.. పనులు చేయరని విమర్శించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రూ.107కోట్లతో చేపట్టిన ఈ పనులను 6నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





