అభంశుభం తెలియన చిన్నారిని అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి, హత్యచేసిన కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ పుణే జిల్లా కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు.
మూడేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన 65 ఏళ్ల భీమరావుకు మరణ శిక్ష విధించిన న్యాయమూర్తి.. ఇది అత్యంత అరుదైన కోవకు చెందిన నేరమని అభివర్ణించారు. ఇందులోని క్రూరత్వం సమాజ మనస్సాక్షిని సైతం దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యానించారు. కిడ్నాప్, లైంగిక వేధింపులు, అత్యాచారం, హత్య ఆరోపణలపై కాంబ్లే దోషిగా తేలిన కొద్ది రోజులకే, పుణే జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.ఆర్. సలుంఖే ఈ తీర్పును వెలువరించారు.ఈ ఘోరం మే 1న పుణే జిల్లాలోని నర్సాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల విచారణ ప్రకారం.. నిందితుడు కాంబ్లే తినుబండారాలు చూపిస్తూ, తన ఆవుకు పుట్టిన దూడను చూపిస్తానని ఆ మూడేళ్ల చిన్నారిని నమ్మించి తీసుకెళ్లాడు. అనంతరం పశువుల పాక పక్కనే ఉన్న ఒక షెడ్డులోకి తీసుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడి, చిన్నారి నోరు నొక్కి, ఛాతిపై తీవ్ర గాయాలు చేసి దారుణంగా హత్య చేశాడు. అయితే, అత్యాచారం సమయంలోనే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.చిన్నారి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టగా.. ఆమె మృతదేహం లభ్యమైంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో కాంబ్లే ఆ చిన్నారిని తనతో పాటు తీసుకువెళ్తున్నట్లు కనిపించింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి అరెస్టు చేశారు.విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 12 కీలక తీర్పులను ప్రస్తావిస్తూ..ఈ నేరం ‘అరుదైన వాటిలోకెల్లా అరుదైన’ కోవలోకి వస్తుందని వాదిస్తుంది. ఈ వాదనతో ఏకీభవిస్తూ ఈ నేరంలోని క్రూరత్వం దృష్ట్యా నిందితుడిపై ఎలాంటి కనికరం చూపే ఆస్కారం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆ చిన్నారికి తగిలిన గాయాల తీరు, ఆ చర్య తీవ్రతను, అమానుషత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.నిందితుడికి కాంబ్లే గతంలోనూ ఒక లైంగిక దాడి కేసుతో సంబంధం ఉందని కోర్టు గుర్తుచేసింది. చట్టపరమైన పరిణామాల గురించి తెలిసినప్పటికీ, విచారణ సమయంలో నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపాన్ని ప్రదర్శించలేదని కూడా కోర్టు ఎత్తి చూపింది. ‘‘కేవలం కామవాంఛ తీర్చుకోవడానికే, ఏ పాపం ఎరుగని, నిస్సహాయురాలైన చిన్నారిని అత్యంత క్రూరంగా హింసించి ఈ నేరానికి ఒడిగట్టాడు...ఎటువంటి రెచ్చగొట్టడం లేకుండా ఈ హత్య కోల్డ్బ్లడడ్తో చేసింది.. ఈ నేరం జరిగిన తీరు కేవలం న్యాయవ్యవస్థనే కాకుండా మొత్తం సమాజ మనస్సాక్షిని సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది’’ అని జడ్జి సలుంఖే తన తీర్పులో పేర్కొన్నారు.‘‘ఈ వయసులోనే అతడిలో కామవాంఛ చల్లారలేదు, సరికదా ప్రమాదకరస్థాయికి చేరుకుంది.. ఆ మూడేళ్ల చిన్నారి శరీరంపై ఉన్న గాయాలు నిందితుడి అమానుష ప్రవర్తనను ప్రతిబింబిస్తున్నాయి.. గతంలో ఇటువంటి కేసుల్లో పట్టుబడినా కోర్టుల్లో ఏమీ కాదు అనే ఒక ధీమా ఉండటం వల్లే, నిందితుడు పరిణామాల గురించి ఆలోచించకుండా, అత్యంత హింసాత్మకంగా, నిర్భయంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.