
Mojtaba Khamenei | ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి బహిరంగంగా కనిపించని అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei)పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ కొత్త సుప్రీం లీడర్ తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంటారా..? రహస్య ప్రాంతం నుంచి దేశాన్ని నడిపిస్తోన్న ఆయన ఇప్పుడైనా బహిరంగంగా కనిపిస్తారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ ఉన్న కాంపౌండ్‌పై జరిగిన దాడుల్లో మొజ్తాబా గాయపడ్డారు. ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో పాటు ముఖమంతా కాలిపోయినట్లు ఆ దేశ మీడియా గతంలో వెల్లడించింది. మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారని, ఆయనను రహస్య ప్రాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నారని పేర్కొంది. ఇజ్రాయెల్ నిఘాకు దొరకకుండా ఉండటం కోసం.. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా ఆయనను కలిసేందుకు వెళ్లడం లేదని వార్తలు వచ్చాయి. పాలనా వ్యవహారాల్లో మాత్రం మొజ్తాబా పేరు వినిపిస్తోంది. ఆయన పేరిటే ప్రభుత్వ ప్రకటనలు వస్తున్నాయి. కానీ సుదీర్ఘకాలంగా మొజ్తాబా బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వాటికి చెక్ పెట్టేలా అంత్యక్రియల్లో మొజ్తాబా కనిపిస్తారా..? అనే చర్చ మొదలైంది. అలీ ఖమేనీ మరణించిన తర్వాతే మొజ్తాబా (Mojtaba Khamenei)ను సుప్రీం లీడర్‌గా ఎన్నుకొన్న సంగతి తెలిసిందే.
జులై 5 నుంచి 9 వరకు ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. తొలుత టెహ్రాన్, ఖోమ్ పట్టణాల్లో అంతిమ సంస్కారాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. 9వ తేదీన ఖమేనీ స్వస్థలం మషాద్‌లో ఆయనను ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని మోదీ (PM Modi)ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీనిని మన ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇరాన్-అమెరికా మధ్య ఇటీవల మళ్లీ ఘర్షణలు భగ్గుమన్నాయి. ప్రస్తుతానికి అవి సద్దుమణిగినప్పటికీ.. ఈ ఉద్రిక్త వాతావరణంలో అలీ ఖమేనీ అంత్యక్రియలను యధావిధిగా కొనసాగిస్తారా..? వాయిదా వేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.