
పూరీలోని శ్రీక్షేత్రంలో జరిగే విశేషమైన వేడుక స్నానపూర్ణిమ ‘మహర్షీ! కౌశిక పుత్రుడైన సోమశర్మ విష్ణు సాక్షాత్కారం పొందిన మహాభక్తుడని విని ఉన్నాను. అతడి వృత్తాంతం చెప్పు’ అని సూతుడిని అడిగాడు శౌనకుడు.
Jun 28 2026 1:16 PM | Updated on Jun 28 2026 1:28 PM
పూరీలోని శ్రీక్షేత్రంలో జరిగే విశేషమైన వేడుక స్నానపూర్ణిమ
‘మహర్షీ! కౌశిక పుత్రుడైన సోమశర్మ విష్ణు సాక్షాత్కారం పొందిన మహాభక్తుడని విని ఉన్నాను. అతడి వృత్తాంతం చెప్పు’ అని సూతుడిని అడిగాడు శౌనకుడు. అప్పుడు సూతుడు అతడికి సోమశర్మ వృత్తాంతం ఇలా చెప్పాడు: కౌశికుడి కుమారుడైన సోమశర్మ చ్యవనుడి కుమార్తె సుమనను పెళ్లాడాడు. అతడు ధనసంపదలు లేనందున దారిద్య్రంతో బాధపడసాగాడు. వివాహమై ఎన్నాళ్లు గడచినా సంతానం లేకపోవడంతో మరింత దుఃఖితుడై లోలోన మనోవేదన చెందసాగాడు.
సోమశర్మ వేదనను గమనించిన అతడి భార్య సుమన, ‘నాథా! మనోవేదన శరీరాన్ని కూడా దహించేస్తుంది. మీరెందుకు బాధపడుతున్నారు?’ అని అడిగింది. ‘దేవీ! ఈ జన్మలో నాకు ధనపుత్ర సంపదలు లేకపోవడం వల్ల దిగులు చెందుతున్నాను. పూర్వజన్మ పాపాల వల్లనే నాకీ గతి ఏర్పడినట్లుందని తలచి దుఃఖిస్తున్నాను’ అని చెప్పాడు. ‘ప్రాణనాథా! సృష్టిలోని సకలజీవులు విషయాశ వల్ల సంసారబాధలు పడుతుండటం సహజమే! మోహం వల్ల లోభం; లోభం వల్ల అసత్యం; అసత్యం వల్ల పాపం; పాపం వల్ల దుఃఖం సంభవిస్తాయి. ఋణానుబంధాల కారణంగా సంతానం కలుగుతుంది. పూర్వజన్మలో మనం ఎవరి వద్ద ధనం తీసుకోలేదు. ఎవరితోనూ మనకు రాగద్వేషాదులు లేవు.’ అని చెప్పింది. ‘నువ్వు చెప్పినది నిజమే! ఇది నివృత్తి మార్గం. కాని, ఎందరో సాధువులైన మహాపురుషులు సకృత కర్మలు ఆచరించి, దారాపుత్రాదులతో చతుర్విధ పురుషార్థాలను పొందారు. మనం ధన పుత్రలాభం పొందే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు’ భార్యను అడిగాడు సోమశర్మ.
‘నాథా! ప్రవృత్తి, నివృత్తి మార్గాలు రెండూ శ్రుతి సమ్మతాలు. ‘పుత్రేణ లోకాన్ జయతి’ అని వేదవాక్యం. పుత్రుడు లోకజయానికి సాధనం. గుణవంతుడు, విద్వాంసుడు అయిన ఒక పుత్రుడి వల్ల వంశం తరిస్తుంది. ఎందరో మహర్షులు ప్రవృత్తిమార్గంలో చతుర్విధ పురుషార్థాలను సాధించారు.’ అంటూ అనేక ఉదాహరణలను చెప్పింది. ‘దేవీ! ఇవన్నీ నువ్వెలా తెలుసుకున్నావు?’ అడిగాడు సోమశర్మ. ‘నాథా! నా తండ్రి చ్యవనుడి ద్వారా కొంత జ్ఞానం పొందాను. ఆయన ద్వారానే కొన్ని పూర్వగాథలను తెలుసుకున్నాను. నాకు తెలిసినంత చెప్పాను. వసిష్ఠ మహర్షి వద్దకు వెళితే ఆయన మరిన్ని విశేషాలు చెప్పగలరు’ అని చెప్పింది సుమన. సోమశర్మ గంగాతీరంలో ఉన్న వసిష్ఠాశ్రమానికి వెళ్లాడు. వసిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. వసిష్ఠుడు అతడిని వచ్చిన కారణమేమిటని అడిగాడు.
‘మహర్షీ! నా దారిద్య్ర బాధలకు, నాకింత వరకు సంతానం కలగకపోవడానికి కారణమేమిటి?’ ప్రశ్నించాడు సోమశర్మ. ‘నాయనా! నువ్వు పూర్వజన్మలో కర్షకుడివి. భార్యాపుత్రులు, సిరిసంపదలతో కలిగిన వాడివి. అయినా జ్ఞానశూన్యుడివై, లోభివై, చివరకు భార్యాపుత్రులకు కూడా తగిన అన్నవస్త్రాదులు సమకూర్చక పీడించావు. నువ్వు సంపాదించిన నిక్షేపాలను రహస్య ప్రదేశాల్లో పాతిపెట్టి, వాటి సంగతి భార్యా పిల్లలకు చెప్పకుండానే కాలధర్మం చెంది, యమలోకానికి చేరుకున్నావు. దాన ధర్మాలు చేయనందునే ఈ జన్మలో దారిద్య్రాన్ని అనుభవిస్తున్నావు’ చెప్పాడు వసిష్ఠ మహర్షి.
‘మరి నాకు ఈ జన్మలో విప్రత్వం లభించడానికి కారణమేమిటి?’ ప్రశ్నించాడు సోమశర్మ. ‘పూర్వజన్మలో సంపన్న కర్షకుడివైన నీ వద్దకు ఒక విప్రుడు వచ్చాడు. నువ్వు అతడికి నీ గోశాలలో ఆశ్రయం ఇచ్చావు. అతడికి షడ్రసోపేతమైన భోజనంపెట్టి ఆతిథ్యమిచ్చావు. ఆ పుణ్యఫలం వల్లనే నీకు విప్రజన్మ లభించింది. నీ దారిద్య్రం తీరాలంటే లక్ష్మీనారాయణుల ధ్యానమే మార్గం’ అని చెప్పాడు వసిష్ఠుడు.
వసిష్ఠుడి సలహాపై సోమశర్మ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రం జపిస్తూ లక్ష్మీనారాయణుల కోసం తపస్సు చేశాడు. అతడి తపస్సును భంగపరచడానికి దేవేంద్రుడు నానా ఆటంకాలు కల్పించాడు. అయినా సోమశర్మ నిశ్చల మనస్కుడై తపస్సు కొనసాగించాడు. సోమశర్మ తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు లక్ష్మీసమేతంగా గరుడారూఢుడై వచ్చి, అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడికి కోరిన వరాలను అనుగ్రహించాడు.
శ్రీమహావిష్ణువు అనుగ్రహం వల్ల సోమశర్మకు దారిద్య్ర బాధ తీరి, ధన సంపదలు సమకూరాయి. కొన్నాళ్లకు పండంటి మగబిడ్డ జన్మించాడు. అతడు బాల్యం నుంచి కృష్ణభక్తుడై దినదినాభివృద్ధి చెందాడు. అతడు యుక్తవయస్కుడు కాగానే సోమశర్మ, సుమన దంపతులు అతడికి వివాహం చేసి, పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లారు.
పురావిశేషం.. పూరీలోని శ్రీక్షేత్రంలో జరిగే విశేషమైన వేడుక స్నానపూర్ణిమ. జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఆలయ అర్చకులు జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను గర్భాలయం నుంచి బయటకు తీసుకువచ్చి, ఆలయ ప్రాంగణంలోని ‘స్నానబేడి’ అనే స్నానాగారంలో పవిత్రస్నానం చేయిస్తారు. ఇందులో భాగంగా 108 కలశాల జలాలతో అభిషేకిస్తారు. ఈరోజు జగన్నాథుడు గజముఖుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. జ్యేష్ఠ పూర్ణిమ రోజు స్నానం తర్వాత జగన్నాథుడు జ్వరం బారినపడి, ‘అనసర ఘర’ అనే జ్వరమందిరంలో పద్నాలుగు రోజులు గడుపుతాడు. - సాంఖ్యాయన
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 28 - జూలై 05)
నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)
రేయ్ JC... నా జోలికి రాకు! ఈసారి మాటలతో చెప్పను...
ఎవడి సొమ్ము అని మా భూములు అడుగుతున్నావ్.. అసలు ఈ గొడవకు కారణం ?
మేడిపల్లి PS పరిధిలో దారుణం.. గృహప్రవేశం జరిగిన ఇంటిపై దాడి
200 భాషల్లో వారణాసి.. జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన ప్రియాంక