
తమిళంలో తాజాగా రూపొందిన ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ తెరపైకి వచ్చింది. మాఫియా నేపథ్యంలో సాగే ఆ సిరీస్ పేరే 'లింగం'.
కథిర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి, లక్ష్మీ శరవణ కుమార్ దర్శకత్వం వహించాడు. 8 ఎపిసోడ్స్ గా నిర్మితమైన ఈ సిరీస్, ఈ నెల 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 'జియో హాట్ స్టార్' లో తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.'కన్యాకుమారి'లో ఫిషింగ్ హార్బర్ ల చుట్టూ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. 'కడప్పురం' పరిథిలో చెల్ల పాండియన్, 'నాగర్ కోయిల్' పరిథిలో సామియప్పన్ చక్రం తిప్పుతుంటారు. ఒకరి ప్రాంతంపై ఒకరు పట్టు సాధించడం కోసం .. ఒకరి ఏరియాలో ఒకరు అక్రమ వ్యాపారాలు చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇరువైపులా అనుచరులు శవాలుగా మారుతూ ఉంటారు.అదే ప్రాంతంలో ముత్తులింగం (కథిర్) తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ కావాలనేది ఆయన ఉద్దేశం. స్పోర్ట్స్ కోటాలోనైనా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో, 'కబడ్డీ' ఆడుతూ ఉంటాడు. లింగంతో పోటీగా కబడ్డీ ఎవరూ ఆడలేరనే ఒక టాక్ ఆ ప్రాంతంలో వినిపిస్తూ ఉంటుంది. అతని ఆట తీరు .. నలుగురికీ సాయం చేసే మంచి మనసు చూసి, 'మలార్' (దివ్యభారతి) మనసు పారేసుకుంటుంది. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు.ఆ ఊర్లో ప్రతి ఏడాది జాతర సందర్భంలో కబడ్డీ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంటుంది. ఆ సమయంలో ముఠా తగాదాలు జరగడం .. అనుచరులు చనిపోతుండటం జరుగుతుంటుంది. ఆ ఏడాది 'గుణశీలన్' అనే రౌడీని 'మార్టిన్' అనే రౌడీ హత్య చేస్తాడు. అయితే సరిగ్గా ఆ ప్రదేశంలో ముత్తులింగం ఉన్న కారణంగా, అతనే గుణశీలన్ ను హత్య చేసి ఉంటాడని అంతా భావిస్తారు. ఫలితంగా అతను కటకటాల పాలవుతాడు.అయితే 'చెల్లదురై' . 'తిరు' కారణంగా జైలు నుంచి బెయిల్ పై బయటికి వచ్చిన ముత్తులింగం, చెల్ల పాండియన్ దగ్గర ప్రధానమైన అనుచరుడిగా చేరతాడు. అటు పోలీసుల బారి నుంచి .. ఇటు గుణశీలన్ అనుచరుల నుంచి తప్పించుకోవడానికి అంతకు మించిన మార్గం లేదని అతను భావిస్తాడు. చెల్ల పాండియన్ కారణంగా ముత్తులింగం .. అతని వలన చెల్ల పాండియన్ ఎదుగుతూ ఉంటారు. దాంతో వాళ్లద్దరినీ అంతం చేస్తే, తన ఆస్తిలో సగం వాటాను ఇస్తానని సామియప్పన్ ప్రకటిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ముత్తులింగం జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. 1980 - 90ల మధ్య కాలంలో జరిగే కథ ఇది. రాజకీయాలు .. రౌడీయిజం .. ముఠా తగాదాల చుట్టూ తిరిగే కథ ఇది. హార్బర్ పై ఆధారపడినవారి జీవితాలతో కొంతమంది అక్రమార్కులు ఎలా ఆడుకుంటారనే అంశం ఇందులో మనకి ప్రధానంగా కనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న ఒక యువకుడిని ఎలాంటి పరిస్థితులు నేరస్థుడిగా మార్చాయి. తాను తీసుకున్న నిర్ణయాలు అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.ఈ కథలో ఒక వైపున రాజకీయ నాయకులు .. వాళ్ల ప్రధానమైన అనుచరులు .. మరో వైపున పోలీస్ అధికారులు కనిపిస్తారు. ఈ మధ్యలోనే లింగం - మలార్ తో పాటు, తిరు - పద్మ లవ్ స్టోరీలు నడుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఈ ట్రాక్ ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ముత్తు లింగం వైపు నుంచి మదర్ సెంటిమెంట్ .. లాయర్ చెల్లా దురై చెల్లెలు సత్య వైవు నుంచి చెల్లెలి సెంటిమెంట్ .. మలార్ వైపు నుంచి ఎమోషన్స్ తో కూడిన లవ్ అక్కడక్కడా టచ్ అవుతుంది.ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. దినేశ్ కుమార్ ఫొటోగ్రఫీ .. నివాస్ కె ప్రసన్న నేపథ్య సంగీతం .. గణేశ్ శివ ఎడిటింగ్ ఫరవాలేదు.ఈ సీజన్ లో హీరో తనకి శత్రువులుగా భావించినవారి తలలను తీసేస్తూ వెళతాడు. అయితే ఆ శత్రువులకు సంబంధించిన వారసులు ప్రతీకారంతో సీజన్ 2 కోసం రెడీ అవుతుండటం మనకి కనిపిస్తుంది.పోలీస్ ఆఫీసర్ కావాలని కలలుగన్న ఒక యువకుడు, తనకి తెలియకుండానే నేర సామ్రాజ్యం దిశగా అడుగులు వేయడం .. లోకల్ డాన్ గా ఎదగడమనే ఈ సిరీస్ కథ నిజానికి చాలా పాతది. కథాకథనాల పరంగా ఎక్కడా కొత్తదనం కోసం ట్రై చేయని సిరీస్ ఇది. 1980లలో ఈ కథ నడుస్తుంది. అప్పట్లోనే ఇలాంటి కథలు చాలా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్పింది లేదు .. చూపించింది లేదు. ఊహించని ట్విస్టులు లేకపోవడం మరొక వెలితి అనే చెప్పాలి. ఈ జోనర్ కి తగినట్టుగానే హింస - రక్తపాతం కనిపిస్తాయి. లవ్ .. ఎమోషన్స్ వైపు నుంచి కూడా పెద్దగా ప్రభావితం చేయలేకపోయిన సిరీస్ గానే చెప్పుకోవలసి ఉంటుంది.