
క్యాన్సర్‌తో పోరాడుతూ.. అదీ 69 ఏళ్ల వయసులో.. ట్రెక్కింగ్ లాంటివి చేయడమంటే చెప్పుకోవాల్సిన విషయమే. తాజాగా ఇలాంటి ప్రయత్నమే చేశారు అలనాటి నటి నఫీసా అలీ. ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతోన్న ఆమెకు..
ఇప్పటికే పలుమార్లు కీమోథెరపీ, ఓసారి శస్త్రచికిత్స చేశారు వైద్యులు.
క్యాన్సర్‌తో పోరాడుతూ.. అదీ 69 ఏళ్ల వయసులో.. ట్రెక్కింగ్ లాంటివి చేయడమంటే చెప్పుకోవాల్సిన విషయమే. తాజాగా ఇలాంటి ప్రయత్నమే చేశారు అలనాటి నటి నఫీసా అలీ. ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతోన్న ఆమెకు.. ఇప్పటికే పలుమార్లు కీమోథెరపీ, ఓసారి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఇలా ఆస్పత్రి వాతావరణం, ఈ ఒత్తిళ్ల నుంచి బయటికొచ్చి కాసేపు ప్రకృతిలో సేదదీరాలనుకున్నారామె. ఈ క్రమంలోనే తన కుటుంబం, స్నేహితులతో కలిసి ఇటీవలే రోహ్తంగ్ పాస్ వద్ద ట్రెక్కింగ్‌కు వెళ్లారు. వయసు, అనారోగ్యాన్ని పక్కన పెట్టి చేసిన ఈ ప్రయత్నం గురించి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘ఇదో సరికొత్త అనుభవం..’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఇది ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది.
కోల్‌కతాలో పుట్టిన నఫీసా.. అందాల రాణిగా, నటిగా, సామాజిక కార్యకర్తగా ఎంతోమందికి సుపరిచితం. 1976లో ‘ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా’ టైటిల్ గెలిచిన ఆమె.. అదే ఏడాది ‘మిస్ ఇంటర్నేషనల్’ అందాల పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి రెండో రన్నరప్‌గా నిలిచారు. ఆపై పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు.
అయితే 2018లో పెరిటోనియల్ (పొత్తికడుపు లోపలి పొర కణజాలంలో వచ్చే క్యాన్సర్), అండాశయ క్యాన్సర్ల బారిన పడ్డారు నఫీసా. అప్పటికే మూడో దశలో ఉన్న ఈ మహమ్మారి నుంచి 2019లో కోలుకున్నారు. అయితే గతేడాది అక్టోబర్‌లో తనకు క్యాన్సర్ తిరగబెట్టినట్లు ప్రకటించారామె. పెరిటోనియల్ క్యాన్సర్ నాలుగో దశలో ఉన్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. దీన్నుంచి బయటపడేందుకు ఇప్పటికే పలుమార్లు కీమోథెరపీ చేయించుకున్న నఫీసాకు ఇటీవలే వైద్యులు ఆపరేషన్ కూడా చేశారు. ప్రస్తుతం 69 ఏళ్ల వయసున్న నఫీసా తన క్యాన్సర్ అనుభవాల్ని, దీంతో ధైర్యంగా పోరాడుతున్న తీరును తరచూ ఇన్‌స్టాలో పంచుకుంటారు ఈ క్రమంలో ఇటీవలే తన కుటుంబం, స్నేహితులతో కలిసి పిక్నిక్కి వెళ్లానంటోన్న నఫీసా.. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
‘గత కొన్ని నెలలుగా ఆస్పత్రి, చికిత్సలు, మందులు.. వీటి మధ్యే గడపాల్సి వచ్చింది. కాస్త రిలాక్సేషన్ కోసం మా కుటుంబం, స్నేహితులతో కలిసి రోహ్తంగ్ పాస్ వద్ద ట్రెక్కింగ్‌కి వెళ్లా. ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు నా కుటుంబ సభ్యుల సహాయం తీసుకున్నా.. కీమోథెరపీ చికిత్సలు, సర్జరీ తర్వాత ఈ వెకేషన్ నాకు సరికొత్త అనుభూతినిచ్చింది.. ఎన్నో మధురానుభూతుల్ని పంచింది.. నన్ను పునరుత్తేజితం చేసింది.. పచ్చటి ప్రకృతిని, కొండా కోనల అందాల్నీ ఆస్వాదించా..’ అంటూ తన అనుభవాలను పంచుకున్నారామె.
⚛ నటిగా, క్యాన్సర్ వారియర్గానే కాదు.. క్రీడాకారిణిగానూ గుర్తింపు పొందారు నఫీసా. ముఖ్యంగా ఈత పట్ల మక్కువ చూపారు. 1972-1974 వరకు వరుసగా మూడుసార్లు ‘జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్’ టైటిల్స్ గెలుచుకొని సత్తా చాటారు.
⚛ గుర్రాలన్నా నఫీసాకు ఎనలేని ప్రేమ. ఈ మక్కువతోనే గుర్రపు స్వారీ నేర్చుకొని పలు గుర్రపు పందేల్లో కూడా పాల్గొన్నారు.
⚛ సమాజ సేవలోనూ ముందుంటారు నఫీసా. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు తన వంతుగా సహాయసహకారాలు అందించారు. వివిధ సంస్థలతో కలిసి సమాజంలో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మహిళా సాధికారత, చిన్నారుల సంక్షేమం కోసం పాటుపడ్డారు.
⚛ రెండుసార్లు క్యాన్సర్ బారిన పడిన ఆమె.. ఓవైపు చికిత్స తీసుకుంటూనే, మరోవైపు తన అనుభవాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తోటి బాధితుల్లో ధైర్యం నింపడంతో పాటు.. సమాజంలో ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
⚛ ప్రముఖ పోలో క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత కల్నల్ రవీందర్ సింగ్ సోథీని వివాహమాడారు నఫీసా. ఈ జంటకు ముగ్గురు పిల్లలు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.