
ఇంటర్నెట్ డెస్క్: ఓ భూమి కొనుగోలు విషయంలో దాదాపు ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు (Supreme Court) ముగింపు పలికింది.
1957లో చేసుకున్న ఓ సేల్ డీడ్‌ను సమర్థిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే, ఈ కేసు తీర్పు వెలువరించిన న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎన్వీ అంజారియాలు జన్మించక ముందు నాటి వివాదం కావడం గమనార్హం.
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని నర్సీపుర్ కలాన్ గ్రామంలో 15.5 బిఘాల భూమిని సరాఫత్ అలీ అనే వ్యక్తి పూర్వీకులు 1957 జూన్‌లో సేల్‌డీడ్ ద్వారా కొనుగోలు చేశారు. అప్పటినుంచి తమ స్వాధీనంలోనే ఉందనేది వారి వాదన. 1980ల్లో ఓసారి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ అధికారులు అందుకు అంగీకరించారు. కానీ, 1991లో భూముల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ సమయంలో.. రికార్డుల్లో యజమానులుగా అమ్మిన వారి పేర్లే కనిపించాయి. దీంతో బాధితులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇల్లు అప్పగింత ఆలస్యమైతే.. పరిహారం కోరవచ్చు: సుప్రీం
అయితే, నాటి భూచట్టానికి అనుగుణంగా కొనుగోలు జరగలేదని, సాక్షి వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని చెబుతూ మ్యుటేషన్‌ను తిరస్కరించారు. 1957నాటి సేల్ డీడ్ చెల్లదన్నారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా అధికారుల నిర్ణయాన్ని సమర్థించడంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. విచారించిన సుప్రీం ధర్మాసనం.. సాక్షాల్లో చిన్న వ్యత్యాసాల ఆధారంగా సేల్‌డీడ్‌ను కొట్టివేయడం సరైంది కాదని పేర్కొంది. ఈ సందర్భంగా 1957లో చట్టబద్ధంగా రిజిస్టరైన డీడ్‌ను సమర్థిస్తూ కొనుగోలుదారులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే, కేసు విచారణ క్రమంలోనే సరాఫత్ చనిపోగా.. అతడి చట్టబద్ధ వారసులు ఈ కేసుపై సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేశారు. దీంతో నాలుగు తరాలుగా కొనసాగిన ఈ వివాదం పరిష్కారమైనట్లైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.