
Bride kills husband: ప్రేమ ఒకవైపు... పెళ్లి మరోవైపు... ఎటువైపు మొగ్గుచూపాలని తెలియక నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసు కేసులతో జైలు పాలై జీవితాలను బుగ్గిపాల్జేసుకుంటున్నారు.
పెళ్లీడుకొచ్చిన యువతుల మానసిక ఒత్తిడితో నేరపూరిత ఘటనల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సియా గోయల్ ఘాతుకం.. కూతురు జీవితాలను అద్భుతంగా తీర్చి దిద్దాలని తల్లిదండ్రులు సంబంధాలను చూసి పెళ్లిచేసి అత్తారింటికి పంపాలనే తపన... పోలీసు కేసులతో జైలుకు పంపేలా చేస్తోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుళ్ల కలను నెరవేర్చాలని తపించే అమ్మానాన్నలను నిర్ఘాంత పోయే విధంగా చేస్తున్నారు. క్షణికావేశం కాదు... ప్రేమ అనే మత్తులో మునిగి... ప్రేమ విజేతగా నిలవాలనే భావన నేరస్తులుగా మిగిలిపోతున్నారు. పోలీసు కేసులతో దోషులుగా నిలిచి... జైల్లో ఊఛల్లెక్కిస్తున్నారు.
విద్యాబుద్ధులతో సమాజం గర్వించుకునే విధంగా బతకాల్సిన యువత.. ప్రేమ ముసుగులో నేరపూరిత చరిత్రలో అమాయకులు బలవుతున్నారు. చదువుతో సంస్కారవంతులుగా ఎదగాల్సిన నవతరం... చరిత్ర హీనులవుతున్నారు. సమాజంలో గర్వించే విధంగా పేరు నిలబెడుతారని, వ్యక్తిగతంగా మంచి పేరుతీసుకొస్తారని భావించిన తల్లిదండ్రులకు తలవంపులు తెస్తున్నారు.
ఫోన్ కాల్ డేటా ఆధారంగా గుట్టును రట్టుచేసిన పోలీసులు.. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఓ కూతురు సియాగోయల్ చేసిన ఉదంతంతో తల్లిదండ్రులు తలదించుకునేలా చేసింది. సంపన్న కుటుంబంతో సంబంధం వెతికి పెళ్లికి నిశ్చయించారు. యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్‌తో పెళ్లి జరిపించే విధంగా పెద్దల సమక్షంలో పెళ్లి కుదిరింది. ఫిబ్రవరిలో ఘనంగా నిశ్చితార్థం చేశారు. నవంబరులో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించాలని పెద్ధలు సన్నాహాలు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కోటలో 17 కోట్ల రూపాయల వ్యయంతో పెళ్లి వేడుక నిర్వహించాలని ప్యాలెస్ బుక్ చేశారు.బంధుమిత్రులను పూణే నుంచి ప్యాలెస్‌కు తీసుకెళ్లేందుకు రెండు హెలికాప్టర్లను సిద్ధంచేసేలా ముందే మాట్లాడుకున్నారు.
పెళ్లి నవంబరులో జరగాల్సి ఉండగా.. సియా గోయల్ తన కాబోయే భర్తతో ప్రీవెడ్డింగ్ షూట్స్ ఫోటోలు, వీడియోలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కాబోయే పెళ్లికూతురు సియాగోయల్ పుట్టినరోజు జూన్ 19వతేదీ కావడంతో విహారయాత్ర వెళ్లేలా ప్లాన్ చేశారు. కాబోయే భార్య పుట్టిన రోజు జీవితంలో గుర్తుండి పోవాలని భావించిన కేతన్ అగర్వాల్‌కు ఒక రోజు ముందే కాబోయే భార్య సియా గోయల్ మరణశాసనం రాసింది.
పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపే క్రమంలో పూణె సమీపంలోని లోహగఢ్ కోట పరిసరాలకు వధూవరులు, మిత్రులతో కలిసి వెళ్లారు. సియా గోయల్ లో నరరూప రాక్షసి విశ్వరూపం దాల్చింది. లోహగఢ్ కోటపై ఫోటోలు తీస్తున్న కేతన్ అగర్వాల్ ను సియా గోయల్ లోయలోకి తోసేసింది. తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ సరదాగా గడుస్తున్న సమయంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
కేతన్ అగర్వాల్ ఫోటోలు తీస్తుండగా... కోటపైనుంచి బలమైన గాలులు వీయడంతో పడిపోయాడని సియాగోయల్ నమ్మించే ప్రయత్నం చేసింది. కేతన్ అగర్వాల్ మరణం ప్రమాదవశాత్తు జరిగిందని భావించారు. అగర్వాల్ కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సియాగోయల్ ప్రవర్తన, మానసిక స్థితి, ఫోన్ కాల్ డేటా సేకరణతో గుట్టురట్టైంది. కేతన్ కు మరణశాసనం రాసింది కాబోయే భార్యేనని నిగ్గుతేలింది. ఇరు కుటుంబాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెళ్లిపీటలు ఎక్కాల్సిన కేతన్ ను, కాబోయే భార్య పాడె ఎక్కించిందని పూణె పరిసరాల్లోనే కాదు..దేశమంతటా తెలుసుకున్న జనం ఆవేదనకు గురయ్యారు.
లోతుగా దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు... కాల్ డేటాను విశ్లేషించిన తర్వాత కేసును మార్చారు. ప్రమాదవశాత్తు జరిగిందనుకున్న కేతన్ అగర్వాల్ మరణం జరిగిందనుకున్న కేసు... కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడుతో కలిసి హత్యకు కుట్ర జరిగిందని పోలీసులు సాంకేతిక వివరాలతో నిర్థారించారు. కేతన్ మృతితో ఎంజాయ్ చేద్ధామనుకున్న సియాగోయల్, ఆమె ప్రియుడు హత్యకేసులు నిందితులయ్యారు. ఇపుడు జైల్లో ఊఛలు లెక్కిస్తున్నారు.
కూతురి జీవితం బాగుండాలని తల్లిదండ్రుల తపన..
మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ, సోమన్లకు ఇరుకుటుంబాల పెద్దలు 2025 మే 11న ఘనంగా వివాహాం జరిపించారు. పెళ్లైన తర్వాత నవ వధువు, వరుడు కలిసి విహారయాత్రకు వెళ్లారు. కశ్మీరీ ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్.. ఆఖరి క్షణంలో మేఘాలయ ప్రాంతంలోని చిరపుంజికి మార్చారు. హనీమూన్ యాత్ర... విషాధయాత్రగా ముగిసింది. ఈ కేసులోనూ నవ వరుడు రాజా రఘువంశీకి, ఆయన భార్య సోనమ్ మరణశాసం రాసింది. ప్రియుడితో కలిసి హత్యకు కుట్రచేసింది. సోనమ్ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసింది. కిరాయి హంతకులతో మాట్లాడుకుని 20 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి భర్త రాజా రఘువంశీని చంపించింది. రఘువంశీ సోదరుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చారు. వధువు సోనమ్ కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. హనీమూన్ మర్డర్ అప్పట్లో దేశమంతటా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సమాజంలో తరచూ ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిన భార్య ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా పూణేలో జరిగిన కేతన్ అగర్వాల్ పెళ్లి కాకముందే.. కాబోయే భార్య చేతిలో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన హత్యా ఉదంతంలోనూ ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన సోనమ్ నిందితురాలైంది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సియా గోయల్ ఘాతుకం.. ప్రాంతమేదైనా సరే... ప్రియుడి మోజులో పడిన యువతులు దారుణానికి ఒడిగడుతున్నారు. ప్రేమను గెలిపించుకోవాలనే పట్టుదల వారిని నిందితులుగా మార్చి.. చట్టం ముందు దోషులుగా నిలబెడుతోంది. ప్రియుడితో కలిసి ఆనందంగా జీవించవచ్చని తలస్తే... అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, కాల్ డేటా నిందితుల్ని పోలీసులకు సులభంగా పట్టించేస్తోంది. చదువుకున్న వారంతా.. వాస్తవాలను తెలుసుకోకుండా... జీవితాలను అంధకార మయం చేసుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చిపెడుతున్నారు. వాస్తవిక జీవితంలో ప్రేమను గెలిపించుకోవాలనే పట్టుదల ఉంటే... తల్లిదండ్రులపై ఆధార పడకుండా... సొంతకాళ్లపై నిలబడగలమనే ఆత్మస్థయిర్యం ఉంటే... నిర్భయంగా తల్లిదండ్రులకు చెప్పి... ప్రేమను గెలవడమేకాదు.. జీవితంలోనూ గెలవాలని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు.
సంస్కారం నేర్పాల్సిన చదువు.. ప్రేమోన్మాదాన్ని పెంచుతోందని బాధిత తల్లిదండ్రులు మదనపడుతున్నారు. పెద్దలమాట కాదనలేక.. మనస్సాక్షిని చంపుకుని, జీవిత భాగస్వామ్యులను కడతేర్చి నిందితులుగా మారిపోతున్నారు. సమాజంలో స్వేచ్ఛగా బతకాలంటే... వాస్తవాలను తల్లిదండ్రులకు చెప్పి... నిజజీవితంలో నిజాయితీగా ఉండేలామసలుకోవాలని, కోరిన వ్యక్తులతో వివాహాం చేసుకుని, స్వేచ్ఛగా జీవితాన్ని సాగించాలని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.