దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన వెండితెర అద్భుతం ‘ బాహుబలి’. ఇందులో ప్రభాస్ హీరోగా నటించగా.. రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.
రెండు భాగాలుగా వచ్చిన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ఇండియన్ సినిమా మార్కెట్ స్థితిగతులనే మార్చేసింది. ‘పాన్ ఇండియా’ అనే కొత్త ట్యాగ్ స్టార్ట్ చేసింది. అలాంటి ఈ సినిమాకి మూడో భాగం రాబోతోంది.‘బాహుబలి’ ప్రాంచైజీలో ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ సినిమాలు వచ్చాయి. దీనికి కొనసాగింపుగా ‘ బాహుబలి 3 ’ ఉంటుందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. మూడో భాగం రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. వారు కోరుకున్నట్టే పార్ట్-3 రానుంది. ఇదేదో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గాలి వార్త కాదు.. గాసిప్ కాదు. అఫిషియల్ గా వచ్చిన వార్త. ప్రభాస్, అనుష్క, రానా సంయుక్తంగా ‘బాహుబలి 3’ ఉంటుందనే విషయాన్ని కన్ఫామ్ చేశారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇందులో భాగంగా ప్రభాస్, రానా, అనుష్కలతో ఓ ప్రమోషనల్ వీడియోని రూపొందించారు. అందులో సినీ ప్రియులకు సర్ప్రైజ్ ఇస్తూ ‘బాహుబలి’ పార్ట్-3 ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. “మీ అందరికీ చెప్పొచ్చో లేదో తెలియదు. రాజమౌళి, నిర్మాత శోభు లేరు కాబట్టి ఏదైతే అది అవుద్దని చెప్పేస్తున్నా.. ప్రపంచం ఈ ప్రకటనకు ఇంకా సిద్ధంగా లేదు. కానీ బాహుబలి ఉంటుంది” అని రానా అన్నారు. రానా, అనుష్క కలిసి “బాహుబలి.. బాహుబలి” అని అంటుండగా.. ప్రభాస్ 3 వేళ్లు పైకి చూపించారు. ఇలా ‘బాహుబలి 3’ రానుందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.