అనుకోకుండా డబ్బులో, బంగారం దొరికితే తీసుకుని దాచేసుకునే రోజులివి. కానీ ఈమె మాత్రం అలా కాదు కళ్లముందు భారీగా బంగారం కనిపించినా సరే నిజాయితీని చాటుకున్నారు. బంగారం పొగొట్టుకున్నవారికి తిరిగి ఇచ్చారు..
ఆమె నిజాయితీతో బెంగళూరు పెళ్లింట్లో ఆనందాన్ని నింపింది. బెంగళూరుకు చెందిన శ్రీభరత్కుమార్ కుటుంబంలో వివాహ వేడుకను తిరుమలలో నిర్వహించారు.. పెళ్లి తర్వాత బుధవారం కుటుంబం మొత్తం కలిసి తిరుమల నుంచి తిరుపతికి వచ్చారు. స్థానిక జూపార్కు రోడ్డులోని గరుడాద్రి హోటల్లో కుటుంబం మొత్తం భోజనం చేశారు.. అనంతరం తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు.భరత్‌కుమార్ కుటుంబం బెంగళూరు చేరుకున్నాక బంగారం ఉన్న బ్యాగ్ కనిపించడం లేదని గుర్తించారు. ఈ బ్యాగులో రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వెంటనే భరత్‌కుమార్ 112కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. పొరపాటున బంగారం ఉన్న ఆ హ్యాండ్‌బ్యాగ్‌ను తిరుపతిలోని హోటల్లో మర్చిపోయినట్లుగా చెప్పారు. వెంటనే తిరుపతి పోలీసులు గరుడాద్రి హోటల్ దగ్గరకు వెళ్లి ఆరా తీయగా.. అక్కడ క్యాషియర్‌గా పనిచేస్తే శశి హ్యాండ్‌బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించారు. బ్యాగును గుర్తించి తాము జాగ్రత్తగా ఉంచామని చెప్పారు.అనంతరం ఆ బ్యాగును భరత్‌కుమార్‌కు అప్పగించారు. ఆ బంగారం మొత్తం వివాహానికి సంబంధించినదని.. ఒకవేళ దొరక్కపోయి ఉంటే ఇబ్బందిపడేవాళ్లమన్నారు. తిరుమలలో వివాహం తర్వాత బ్యాగులో ఆ బంగారాన్ని పెట్టుకున్నారు.. హోటల్‌కు వచ్చిన సమయంలో మర్చిపోయామన్నారు. హోటల్ క్యాషియర్ శశి నిజాయితీతో బంగారం దొరకడం మాత్రమే కాదు.. పెళ్లింట సంతోషాన్ని తెచ్చింది. భరత్‌కుమార్ క్యాషియర్ శశి, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు నిజాయితీని చాటుకున్న క్యాషియర్ శశిని డీపీవోకు పిలిపించి ఘనంగా సత్కరించారు. మనిషి సంపాదించే అత్యంత విలువైన ఆస్తి నిజాయతీ అన్నారు ఎస్పీ సుబ్బరాయుడు. శశి చూపిన బాధ్యత, నిబద్ధత, నిజాయితీ సమాజంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఇటువంటి వ్యక్తుల వల్లనే సమాజంలో నైతిక విలువలు మరింత బలపడతాయని.. అలాగే ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తుందన్నారు.