ఇటీవల ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన ఎంపీల్లో ఒకరైన సంజయ్ దీనా పాటిల్ జర్నలిస్ట్‌లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు.
తన కుటుంబ సభ్యుల రాజకీయ విధేయతపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నతో రెచ్చిపోయిన ఆయన ‘మళ్లీ వస్తే చంపేస్తా’ అంటూ బెదిరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీనా పాటిల్ షిండే వర్గంలో చేరినా.. కార్పొరేటర్ అయిన ఆయన కుమార్తె, రాజుల్ పాటిల్ మాత్రం ఉద్ధవ్ వర్గంలోనే కొనసాగుతున్నారు. గురువారం ఎంపీ సంజయ్ పాటిల్‌ను కలిసిన కొందరు విలేకరులు.. ఇదే విషయంపై ప్రశ్నించారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన.. రెచ్చిపోయారు. ‘‘అది నా వ్యక్తిగత విషయం.. దాంతో మీకేం పని? మళ్లీ నా దగ్గరకు వస్తే చంపుతా’’ అంటూ బెదిరింపులకు దిగారు.ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో ఏక్నాథ్ షిండే నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. జర్నలిస్ట్‌లను అవమానించాలనే ఉద్దేశం సంజయ్ దీనా పాటిల్‌కు లేదని, ఆయన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణ చెప్పాలని సూచించినట్లు చెప్పారు. ప్రత్యర్థి వర్గం ఉద్దేశపూర్వకంగానే కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకోవడంతో పాటిల్ అలా స్పందించి ఉంటారని, 2022 (శివసేన చీలిపోయిన తర్వాత) నుంచి ఇదే జరుగుతోందని షిండే సమర్దించే ప్రయత్నం చేశారు. అలాగే, ఆరుగురు రెబల్ ఎంపీలపై శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ ఉపయోగించిన అభ్యంతరకరమైన భాషపై కూడా పరోక్షంగా విమర్శించారు.‘‘ప్రతి రోజు కొంతమంది మీడియా ముందు ‘వారిని చంపండి’, ‘వారి ఇళ్లలోకి ప్రవేశించి తరిమి కొట్టండి’ వంటి భాషను ఉపయోగిస్తారు. ఇటువంటి ప్రకటనలు రాజకీయ సంస్కృతికి విరుద్ధం మాత్రమే కాకుండా మీడియాను కూడా అవమానిస్తాయి’’ అని ఆయన అన్నారు. అయితే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం బెదిరింపులకు దిగడం తప్పేనని, ఈ వివాదంపై పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని వ్యాఖ్యానించారు.అటు, ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. సంజయ్ రౌత్ స్పందిస్తూ.. దీనా పాటిల్ గతంలోనూ ‘బాంబులు వేస్తా’,‘ఐదుగురిని చంపాను’ వంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఉపా చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ ముంబయి పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. కాంగ్రెస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీడియా, జర్నలిస్టులను సంజయ్ దీనా పాటిల్ బెదిరించడం సరికాదు. మేము దానిని ఖండిస్తున్నాం.. అసలు విషయం ఏమిటంటే సంజయ్ దీనా పాటిల్ ఇంతకుముందు ఇలా మాట్లాడేవారు కాదు. కానీ ఈ రోజుల్లో ఆయన ఎందుకంత ఎక్కువగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వడెట్టివార్ అన్నారు.షిండే వర్గంలో చేరిన తర్వాత తన తండ్రి దీనా పాటిల్ (మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే)పై దాడి జరిగినప్పుడు తాము ఐదుగురిని చంపినట్లు సంజయ్ పాటిల్ మీడియాకు తెలిపారు.