
LPG Cylinders : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు భారీ ఉపశమనం.. దేశంలో పారిశ్రామిక, వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఎల్పీజీ గ్యాస్ కమర్షియల్ సిలిండర్లపై ఆంక్షలు పూర్తిగా ఎత్తేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా గతంలో విధించిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లపై విధించిన అన్ని రంగాల వారీ పరిమితులను ఎత్తివేసినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తద్వారా కమర్షియల్ ఎల్పీజీ సరఫరా ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంది. సంక్షోభ (LPG Cylinders) సమయంలో నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాను కూడా మళ్లీ పునరుద్ధరించారు. అయితే పూర్తిగా కాకుండా, ముందస్తు వినియోగ స్థాయిలతో పోలిస్తే.. సుమారు 50 శాతం మేర సడలింపు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయంతో పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు భారీ ఉపశమనం లభించినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also : CM Revanth Reddy : తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు..!
పశ్చిమ ఆసియా సంక్షోభ సమయంలో దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తాత్కాలికంగా పెట్రోకెమికల్, ఇతర అనుబంధ రంగాల నుంచి వచ్చే C3-C4 స్ట్రీమ్‌లను మళ్లించింది. దాంతో పూర్తిగా ఎల్పీజీ ఉత్పత్తికి మాత్రమే వినియోగించేలా ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లోనూ దేశీయ సరఫరా కొరత రాకుండా చర్యలు చేపట్టింది.
ఇప్పుడు గ్యాస్ సరఫరా పరిస్థితి మెరుగుపడింది. ఎల్పీజీ పూల్‌కు C3/C4 స్ట్రీమ్‌ల మళ్లింపును తగ్గించాలని నిర్ణయించింది. అలాగే ఎల్పీజియేతర అవసరాలకు కేటాయింపును కూడా పెంచనుంది.
ముఖ్యంగా, దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 40 టీఎమ్‌టీ కన్నా తగ్గకుండా దిగుమతి చేసిన ఎల్పీజీ కార్గోల లభ్యతను పరిగణలోకి తీసుకుని ఈ సడలింపులు అమలు చేస్తున్నట్టు పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కీలక నిర్ణయంతో కమర్షియల్, ఇండస్ట్రియల్ వినియోగదారులకు సరఫరా స్థిరత్వం పెరగనుంది. అలాగే ఖర్చుల ఒత్తిడి కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.