LPG Cylinder: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగి ఇంధన ధరలు దిగివస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో ఎల్పీజీ డిమాండ్ తగ్గడం, సరిపడా సరఫరా ఉన్న క్రమంలో గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. కమర్షియల్, పారిశ్రామిక ఉపయోగ నాన్- డొమెస్టిక్ ప్యాక్ట్ ఎల్పీజీ సిలిండర్ల (Non Domestic Packed LPG) సరఫరాపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసినట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం ప్రకటన చేసింది. దీంతో పారిశ్రామిక, వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు భారీ ఉపశమనం లభించినట్లయింది.ఇకపై ఎలాంటి పరిమితులు లేకుండా సిలిండర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.వాణిజ్య వినియోగదారులకు (హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు) గ్యాస్ సరఫరాను మునుపటి స్థాయికి (సంక్షోభానికి ముందు స్థాయి) పునరుద్ధరిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. బల్క్ ఎల్పీజీ సరఫరా పరిమితుల్లో 50 శాతం సడలింపులు ఇస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు వివాహాలు, శుభకార్యాలు, ఇతర ఈవెంనట్లకు కమర్షియల్ సిలిండర్ల కొనుగోలుకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంక్షలు తొలగించామని పేర్కొంది. ఇక పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లకు మారిన గృహ వినియోగదారుల పాత ఎల్పీజీ సిలిండర్లను సరెండర్ చేసేందుకు 30 రోజుల సమయం ఇచ్చేలా ప్రభుత్వం కొత్త ఎల్పీజీ సవరణ ఉత్తర్వులు ఇచ్చినట్లు గుర్తు చేసింది.పశ్చిమాసియా సంక్షోభ సమయంలో, దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అవసరమైన వస్తువుల చట్టం (Essential Commodities Act) కింద ఒక ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్రకారం పెట్రోకెమికల్, ఇతర అనుబంధ వినియోగాలకు మళ్లించబడే C3-C4 స్ట్రీమ్‌లను (ముడి పదార్థాలను) పూర్తిగా ఎల్పీజీ ఉత్పత్తికే వినియోగించాలని నిర్దేశించింది. 'దేశీయంగా LPG ఉత్పత్తి మెరుగుపడటం, దిగుమతి చేసుకునే LPG నిల్వలు అందుబాటులో ఉంటాయని అంచనా వేయడాన్ని పరిగణనలోకి తీసుకుని, C3/C4 స్ట్రీమ్‌లను LPG పూల్‌కు మళ్లించడాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది' అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ పేర్కొంది.