Venezuela Doublet Earthquakes : దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో బుధవారం రాత్రి ప్రకృతి దాల్చిన ఉగ్రరూపం గురించి అందరికీ తెలిసిందే.
రాజధాని కారకాస్ సమీపంలో కేవలం 39 సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు అత్యంత శక్తివంతమైన జంట భూకంపాలు దేశం మొత్తాన్ని అతలాకుతలం చేశాయి. మొదట రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో ప్రకంపనలు రాగా.. తదుపరి క్షణాల్లోనే 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం దూసుకొచ్చింది. శతాబ్ద కాలంలో దేశంలో ఎన్నడూ ఎరుగని ఈ మహా విపత్తు ధాటికి వందలాది భవనాలు నిలువునా కూలిపోయాయి. ఈ ఘోర పరిణామాల నేపథ్యంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ దేశవ్యాప్తంగా ‘అత్యవసర స్థితి’ ప్రకటించారు.39 సెకన్ల వ్యవధిలో ‘ఫోర్‌షాక్, మెయిన్షాక్’యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) నివేదిక ప్రకారం.. కారకాస్‌కు పశ్చిమంగా 168 కిలో మీటర్ల దూరంలోని మొరాన్ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదైంది. మొదటి భూకంపం 7.2 తీవ్రతతో భూగర్భంలో 21.9 కిలోమీటర్ల లోతులో సంభవించగా.. దానిని ఫోర్‌షాక్‌గా గుర్తించారు. ఆ తర్వాత కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే 10 కిలోమీటర్ల లోతులో 7.5 తీవ్రతతో 'మెయిన్షాక్' విరుచుకుపడింది. దీని తర్వాత మరో 20 సార్లకు పైగా చిన్నపాటి ప్రకంపనలు రావడంతో ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రస్తుతం ప్రాథమికంగా 32 మంది మరణించినట్లు, 700 మందికి పైగా గాయపడినట్లు ప్రభుత్వం ధృవీకరించినప్పటికీ.. మరణాల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉండే ప్రమాదం ఉందని యూఎస్జీఎస్ అంచనా వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత.. కూలిన పైకప్పు!భూకంపం ధాటికి వెనిజులా ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయ 'సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం' (సీసీఎస్) తీవ్రంగా దెబ్బతింది. టెర్మినల్ లోపల ప్రయాణికులు లగేజీలతో పరుగులు తీస్తుండగానే ఎయిర్పోర్ట్ పైకప్పులో కొంత భాగం ఒక్కసారిగా కూలిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో.. విమానాశ్రయం అంతా చీకటి, ధూళి మేఘాలతో నిండిపోయింది. మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతినడంతో ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. దేశంలో విద్యాసంస్థలను కొన్ని రోజుల పాటు బంద్ చేస్తున్నట్లు, వైద్య సిబ్బంది అంతా అత్యవసర సేవ నిమిత్తం ఆసుపత్రులకు చేరుకోవాలని ఆదేశించారు.1967 నాటి భూకంపం కంటే భయానకం!కారకాస్‌లోని చాకావో మున్సిపాలిటీ పరిధిలో ఒకే భవన శిథిలాల నుండి 18 మంది ప్రాణాలతో బయటపడగా.. ఫాల్కన్ రాష్ట్రంలో ఇంకా అనేకమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. "నా అపార్ట్మెంట్లో వస్తువులన్నీ కిందపడిపోయాయి. నడుస్తుంటే భూమి మమ్మల్ని ఇటూ అటూ విసిరికొట్టినట్లు అనిపించింది" అని స్థానికులు వాపోయారు. 1967లో కారకాస్‌ను వణికించిన 6.3 తీవ్రత భూకంపం కంటే ఇది అత్యంత ఘోరమైనదని 80 ఏళ్ల వృద్ధురాలు కన్నీరు పెట్టారు. ఈ కష్టకాలంలో తాము వెనిజులా ప్రజలకు తోడుగా ఉంటామని, తక్షణ సహాయక చర్యలను మొబిలైజ్ చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. దారుణమైన కొండచరియలు విరిగిపడటంతో రెస్క్యూ ఆపరేషన్లకు ఆటంకం కలుగుతోంది.