
అక్కాచెల్లెళ్లకు మాయగాళ్ల వల... నమ్మి రైలెక్కిన బాలికలు సీపీ సజ్జనర్ చొరవతో రక్షించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈనాడు, హైదరాబాద్: వారు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. 8, 9 తరగతులు చదువుతున్నారు.
ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడటంతో తల్లి తరచూ మందలిచేది. ఇదే విషయాన్ని తమతోపాటే గేమ్ ఆడుతున్న అపరిచితులైన మాయగాళ్లతో పంచుకోగా... ‘ఈసారి మీ అమ్మ కోప్పడితే బిహార్ వచ్చేయండి. ఇక్కడ ఆన్లైన్ గేమ్స్ ఉచితంగా ఆడుకోవచ్చు’ అని వాళ్లు చెప్పారు. ఇంకేం వెనకాముందు ఆలోచించకుండా ముగ్గురూ ఈ నెల 22న రైలు ఎక్కేశారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించారు. వారు తీవ్రంగా శ్రమించి ముగ్గుర్నీ ఆంధ్రప్రదేశ్‌లో రక్షించారు. ఈ ఘటన హైదరాబాద్ ఫలక్‌నుమాలో చోటుచేసుకుంది.
బాలికలు తమ కుటుంబసభ్యుల సెల్ఫోన్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడేవారు. దీన్ని ఆన్లైన్లో ఒకేసారి 4-16 మంది కలిసి ఆడొచ్చు. ఈ క్రమంలో బాలికలకు బిహార్‌కు చెందిన గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడి... వారితో గంటల తరబడి ముచ్చటించేవారు. ఈ క్రమంలో గేమ్స్ ఆడుతున్నందుకు తల్లి కోప్పడుతోందని బాలికలు వారికి చెప్పారు. అదనుగా తీసుకున్న ఆ అపరిచితులు బిహార్ వస్తే ఉచితంగా ఫ్రీ ఫైర్ ఆడుకోవచ్చని, తమవద్ద చాలా ఫోన్లున్నాయని ఆశ చూపారు. ఈ నెల 22న తల్లి కోప్పడటంతో... ముగ్గురూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకుని బిహార్ వెళ్లే రైలెక్కారు.
తల్లి ఫిర్యాదుతో పోలీసులు పిల్లలు ఫ్రీ ఫైర్ ఆడిన సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దానిలో లభించిన ఐడీ ఆధారంగా నగరానికి చెందిన ఓ బాలుడితోనూ బాలికలు ఫ్రీఫైర్ ఆడినట్టు గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆధారంతో అతన్ని కనిపెట్టి... ప్రశ్నించటంతో బాలికలు బిహార్ వెళ్లినట్టు సమాచారమిచ్చాడు. ఈ క్రమంలో ప్రయాణంలో ఉన్న బాలికలు రైల్లో పరిచయమైన ఓ వ్యక్తి ఫోన్ తీసుకొని బిహార్‌లోని అపరిచితులతో తాము రైలులో బిహార్ వస్తున్నట్లు ఇన్‌స్టా ద్వారా సమాచారమిచ్చారు. అట్నుంచి అపరిచితులు ‘కోల్‌కతా రండి. ఇక్కడ చాలా గేమ్‌లు ఆడుకోవచ్చు’ అంటూ రిప్లై ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలు ఉపయోగించిన ఫోన్ నంబరు ఆధారంగా వారు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్నట్లు గుర్తించి.. రైల్వే, ఏపీలోని ఏలూరు పోలీసులకు ముగ్గురు బాలికల సమాచారమిచ్చారు. వారు అప్రమత్తమై బాలికలు మాయగాళ్ల చెరకు చిక్కకుండా కాపాడారు. పిల్లల్ని భద్రంగా తల్లి ఒడికి చేర్చిన పోలీసు సిబ్బందిని సీపీ సజ్జనర్ అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.