
రెండింతలు దాటిన అధిక వేడి రోజులు సగటున 10 నుంచి 23 రోజులకు పెరుగుదల దేశంలో ఉక్కపోత రోజులు 101 నుంచి 141కి చేరిక ప్రపంచ వ్యాప్తంగా క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం ఈనాడు, హైదరాబాద్: మానవ తప్పిదాలతో...
రెండింతలు దాటిన అధిక వేడి రోజులు సగటున 10 నుంచి 23 రోజులకు పెరుగుదల దేశంలో ఉక్కపోత రోజులు 101 నుంచి 141కి చేరిక ప్రపంచ వ్యాప్తంగా క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం
ఈనాడు, హైదరాబాద్: మానవ తప్పిదాలతో వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు పెరిగాయని క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం వెల్లడించింది. 1970లో అత్యంత ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు పది ఉంటే ఇప్పుడు 23కి చేరాయని వివరించింది. గత 50 ఏళ్లలో ఇప్పటివరకు నమోదవుతున్న అత్యధిక ఉక్కపోత రోజులకు 64 శాతం మానవ తప్పిదాలే కారణమని పేర్కొంది. సగటు ఉష్ణోగ్రతల కన్నా 1.2 డిగ్రీల వేడి ఎక్కువగా ఉంటోందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అరుదుగా, అసాధ్యంగా కనిపించే వేడి రోజులు..సాధారణంగా మారడంతో లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి ప్రభావం వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు, చల్లదన (ఏసీ, కూలర్, ఫ్యాన్) సదుపాయాల్లేని వారిపై ఎక్కువ ఉందంది.1970తో పోల్చితే ప్రస్తుతం ఆరు రెట్లు ఎక్కువ ఉక్కపోత రోజులు సంభవిస్తున్నాయంది.2025లో ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు 23 ఉంటే, వీటిలో 19 వాతావరణ మార్పులతో ఏర్పడినవని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన తేమతో కూడిన ఉక్కపోత రోజులున్న 50 నగరాల జాబితాలో దేశం నుంచి నాలుగు ఉన్నాయి. దేశంలోనూ ఉక్కపోత రోజులు 101 నుంచి 141కి చేరినట్లు అధ్యయనం వెల్లడించింది.
గరిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటితే ఆ రోజును ప్రమాదకరమైన ఉక్కపోత రోజుగా క్లైమేట్ సెంట్రల్ సూచీ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 254 దేశాలు, 961 నగరాల ఉష్ణోగ్రతల డేటాను విశ్లేషించింది. శిలాజ ఇంధనాలను అధికంగా మండించడంతో భూమి వేడెక్కడం, వాతావరణ మార్పులతో ఉక్కపోత కలిగిన రోజుల సంఖ్య పెరుగుతోంది. 1970 నుంచి 2025 వరకు నమోదైన ఉష్ణోగ్రతలు, గణాంకాల ఆధారంగా అధ్యయనం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.