
ఇంటర్నెట్ డెస్క్: సింగపూర్ ఎయిర్‌లైన్స్ (Singapore Airlines) సిబ్బందితో ఇటీవల ఓ భారతీయ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఎయిర్‌హోస్టెస్‌ను అసభ్యంగా తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు.
ఈ కేసులో అతడిని దోషిగా నిర్ధరించిన స్థానిక న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 1270 సింగపూర్ డాలర్ల (సుమారు రూ.92వేలు) జరిమానా కూడా వేసింది.
న్యాయస్థానం తీర్పు కాపీ ప్రకారం.. భారత్‌కు చెందిన ఆకాశ్ తివారీ (35) అనే యువకుడు నలుగురు మిత్రులతో కలిసి థాయిలాండ్ నుంచి సింగపూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో ఎయిర్‌హోస్టెస్ అటువైపు వచ్చినప్పుడల్లా ఈ యువకులు నవ్వడం మొదలుపెట్టారు. అంతేకాదు, విమానం బయలుదేరక ముందు భోజనం వివరాలు తీసుకునేందుకు ఓ అటెండెంట్ దగ్గరకు రాగా.. ఆమె కాళ్లను తాకుతూ నవ్వాడు. అది చూసిన అతడి మిత్రులు కూడా నవ్వడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆ ఎయిర్‌హోస్టెస్ విమానంలోని సీనియర్ సిబ్బందికి వివరించారు.
ఆ తర్వాత ప్రయాణం మధ్యలో ఫుడ్ ట్రేలను తీసుకునేందుకు వారివద్దకు వేరొక అటెండెంట్‌ను పంపించగా.. ఆమెతోనూ యువకులు అనుచితంగా ప్రవర్తించారు. తమను తాకవద్దని ఇద్దరు ఎయిర్‌హోస్టెస్‌లు వారించినప్పటికీ.. క్షమాపణ చెప్పడానికి బదులు తాను ఏ తప్పు చేయలేదంటూ తివారీ బుకాయించాడు. ఇదే విషయాన్ని సూపర్‌వైజర్‌తోపాటు కెప్టెన్‌కు చెప్పేందుకు బాధిత అటెండెంట్ వెళ్తుండగా.. అతి దగ్గరగా వచ్చిన యువకుడు అమెకు అడ్డుగా నిలబడ్డాడు. బెదిరింపు ధోరణిలో మాట్లాడడంతో ఆమె భయంతో వణికిపోయారు. చివరకు చాంగీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే విమాన సిబ్బంది జరిగిన విషయాన్ని ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆకాశ్‌ను అరెస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.