కడియం ఆంధ్ర పేపర్ మిల్లు లో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ డిమాండ్ చేశారు.
55 రోజులుగా వేతనాల పెంపు కోసం పోరాడుతున్న కడియం ఆంధ్ర పేపర్ మిల్లు కార్మికులకు మంత్రి సంఘీభావం ప్రకటించారు. యాజమాన్యం అవలంభిస్తున్న వైఖరిని ఖండించిన కందుల దుర్గేష్.. కార్మికుల శ్రమ, అంకితభావంతోనే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. అలాంటి కార్మికులను వేతనాల పెంపు కోరినందుకు విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లోకి తీసుకునే విషయంలో ఏ ఒక్క కార్మికుడిని విస్మరించినా ప్రభుత్వం అంగీకరించదని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకుని కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కందుల దుర్గేష్ సూచించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రతి పేపర్ మిల్లు ద్వారా వచ్చే కాలుష్యాన్ని నియంత్రిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పేపర్ మిల్లు యాజమాన్యం తప్పులు పెట్టుకుని.. కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. తక్షణమే 70 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని.. లేకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమలు ఉండాలి.. పెట్టుబడులు రావాలి.. ఆర్థికాభివృద్ధి జరగాలన్న మంత్రి కందుల దుర్గేష్.. కానీ వాటి కంటే ముందు కార్మికుల సంక్షేమం, కార్మిక కుటుంబాల భద్రత తమకు అత్యంత ముఖ్యమైనవిగా పేర్కొన్నారు.లాభాలు పొందుతూ కూడా కార్మికుల కష్టాలను పట్టించుకోకుండా.. వారిపై కక్షసాధింపు చర్యలకు దిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్ర పేపర్ మిల్లు విషయమై ఇప్పటికే జిల్లా అధికారులతో, యాజమాన్యంతో మాట్లాడానని.. సమస్య పరిష్కారంలో పురోగతి కనిపించలేదని తెలిపారు. మరో మూడు రోజులలో కార్మికులతో కలిసి తానే సమ్మెలో పాల్గొంటానని. కార్మిక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం చివరి వరకు పోరాడుతానని కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్ మిల్లు మే నెలలో లాకౌట్ ప్రకటించింది. దీంతో కార్మికులు, వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 1964లో ఈ మిల్లును ప్రారంభించగా.. రూ.3,400 కోట్లతో ఆధునీకరించాలని భావించారు.. కానీ ఇంతలోనే లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.