బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సింగరేణి అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఆయనకు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పుతో గత కొంతకాలంగా రిమాండ్‌లో ఉన్న సుమన్‌కు ఊరట లభించినట్లయింది.కేసు నేపథ్యం పరిశీలిస్తే, గత మే 26న జరిగిన పార్టీ సమావేశంలో బాల్క సుమన్, నాంపల్లిలోని సింగరేణి భవన్, మందమర్రిలోని జనరల్ మేనేజర్ కార్యాలయ అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అశాంతిని రేకెత్తించేలా ఉన్నాయని పేర్కొంటూ సింగరేణి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, మే 30న తెలంగాణ భవన్లో సుమన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలులో సుమన్‌ను పరామర్శించి, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు.