
మీరు చక్కని ప్రశ్న అడిగారు. పుష్కరాలనేవి ఒక నదికి 12 ఏళ్లకోసారి ఏర్పడే పుణ్యసమయం. ఇలాంటి పుణ్య కాలంలో పితృదేవతలకు సంబంధించిన కార్యాలు ఆచరించి వారి కృప పొందాల్సిన ముఖ్య సమయం.
తెలిసి గానీ, తెలియక గానీ మనుషులు చేసిన పాపాలను తొలగించుకొని పుణ్యాన్ని పొందగలిగేందుకు ఉత్తమ సమయం. అందువల్లే, ఏ నదికైతే పుష్కరాలు ఏర్పడుతున్నాయో.. ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలు ఆ పుష్కరాలు జరిగిన సంవత్సరం పాటు శుభకార్యాలను ఆచరించరు. 2027లో గోదావరి నదికి పుష్కరాలు జరగనున్నాయి. దీనివల్ల గోదావరి ప్రవహించే ప్రాంతాల్లో (ఉదా: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వంటి ప్రాంతాల వారు ఆ ఒక్క సంవత్సరం పుష్కరాల నియమాలను అనుసరించి) శుభకార్యాలను ఆచరించరు. ఇతర ప్రాంతాల వారు యథాతథంగా ఆచరించవచ్చు.
పుష్కరాలు 12 రోజులే కదా.. మరి, సంవత్సరం మొత్తం ఎందుకు శుభకార్యాలు ఆచరించకూడదనే సందేహం రాకమానదు. గోదావరి వంటి పుణ్య నదులకు ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు ఉంటాయి. ఇదే కాకుండా ఒక నదికి పుష్కరాలు ఏర్పడినప్పుడు మొదటి పన్నెండు రోజులూ, పుష్కరాల పుణ్య దినాలైన తర్వాత మిగిలిన ప్రతి రోజూ ఆ సంవత్సరంలో మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తిన ఉండే సమయానికి అభిజిత్ ముహూర్తంలో పుష్కరాలు జరుగుతాయి. అంటే, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నవారు ప్రతి రోజూ అభిజిత్ ముహూర్త సమయంలో (ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 12.20 మధ్య సమయంలో) ఆ ఏడాదంతా పుష్కర స్నానాలు ఆచరించొచ్చు.
పుష్కరాల సమయంలో వివాహాలు చేయరాదనే విషయం.. ప్రధానంగా ధర్మసింధు, నిర్ణయ సింధు వంటి గ్రంథాల ఆధారంగా ఏర్పడిన ఆచార సంప్రదాయం. ఇది ఏర్పడడానికి ముఖ్య శాస్త్రోక్త కారణం ఏమిటంటే.. పుష్కరాల సమయం తీర్థయాత్ర కాలం అవడంతో ఈ సమయంలో ప్రజలు పుణ్యార్చన చేయడం, ముఖ్యంగా నదీతీరాల్లో స్నానాలు చేయడం, పితృతర్పణాలు వదలడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల గృహస్తులు శుభ కార్యాలకంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పెద్దలు నిర్ణయించారు. పితృకార్యాలు, వివాహాది మంగళకార్యాలు ఒకే సమయంలో చేయరాదనే ఆచారం ఉంది. ఈ ఆచార, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని పెద్దలు, పండితులు పుష్కరాలు జరిగే సమయంలో వివాహాలను గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలను నిర్వహించరు. దీన్ని అనుసరించి 2027 జూన్ 26 నుంచి 2028 జులై 24 వరకు గోదావరి పుష్కరాలు జరిగే ఈ సంవత్సర కాలంలో గోదావరి ప్రవహించే ప్రాంతాల్లో వివాహాది శుభకార్యాలను జరపకూడదనేది ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం. (గమనిక: పుష్కరాల సమయంలో జాతకర్మ, నామకరణ, సీమంతం, ప్రసవం, కర్ణవేద వంటి కార్యక్రమాలను యథావిథిగా ఆచరించుకోవచ్చు.)
ఇక, రాశుల ప్రకారంగా చూస్తే.. పుష్కర సమయంలో వివాహాది కార్యక్రమాలు చేయరాదనే నియమాలంటూ ఏమీ లేవు. ఇది రాశులకు వర్తించదు. ఇది కేవలం పుష్కరాలు జరిగే నదీపరివాహక ప్రాంతాలకు నివసించే వారికి మాత్రమే వర్తిస్తుంది.
ఇక మీ జాతకం విషయానికి వస్తే, మీది మంచి జాతకం. మీ జాతకంలో పంచ గ్రహ కూటమి, శని స్వక్షేత్రం. లగ్నంలో చంద్రుడు వంటి శుభ గ్రహస్థితులు ఉన్నాయి. మీది కన్య రాశి. మీకు ప్రస్తుత సమయం అనుకూలంగా ఉన్నది. అందువల్ల మీరు గోదావరి పరిసర ప్రాంతాల్లో లేకపోయినట్లయితే మీరు ఎలాంటి ఆటంకం లేకుండా వివాహం చేసుకోవచ్చు. మీది విశాఖపట్నం గనుక గోదావరి, కృష్ణా పుష్కరాల ప్రభావం మీ ప్రాంతంపై ఉండదు. కాబట్టి యథావిథిగా వివాహ కార్యక్రమాలను ఆచరించవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.