Rajinikanth Denies Jealousy on Vijay : తమిళనాడులో ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చి ఘన విజయం సాధించిన టీవీకే అధినేత.. సీఎంగా తన మార్కు చూపించేందుకు చాలానే కష్టపడుతున్నారు.
అయితే ఇలా వచ్చి అలా ఘన విజయం సాధించడం, ఏకంగా విజయ్ సీఎం కావడంపై రజనీకాంత్ అసూయ పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్లపై బుధవారం రజనీకాంత్ తనదైన శైలిలో స్పందించారు. తాను మాట్లాడినా, మాట్లాడకపోయినా కొంత మంది సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇంకా ఏమోం మాట్లాడారో మనం ఇప్పుడు తెలుసుకుందామా?మాట్లాడితే ఒక గోల.. మౌనంగా ఉంటే మరో గోల!తనపై వస్తున్న ఆరోపణల గురించి 76 ఏళ్ల రజనీకాంత్ మాట్లాడుతూ.. "నన్ను ఎక్కడైనా మాట్లాడమని అడిగితే నేను చాలా వెనుకడుగు వేస్తాను. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా అది నాకూ, ఇతరులకూ సమస్యగా మారిపోతోంది. ఏదో ఒక వివాదాన్ని లేపుతోంది. ఒకవేళ నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే.. 'ఎందుకు మౌనంగా ఉన్నాడు?' అని విమర్శిస్తారు. అదే మాట్లాడితే.. 'ఓహో.. ఇప్పుడు మాట్లాడుతున్నాడా.. అతను మాట్లాడకుండా ఉండాల్సింది' అని మరికొందరు కామెంట్లు చేస్తారు" అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.అభిమానం ఎప్పటికీ ఒకేలా ఉండదంటూ..!అక్కడితో ఆగకుండా.. "మిమ్మల్ని ఇష్టపడని వారు మీరు ఏం చేసినా ఇష్ట పడరు. అది అంతే. ఇప్పుడు మనల్ని ఇష్టపడుతున్న వారు ఎప్పటికీ అలాగే ఇష్టపడుతూ ఉంటారని అనుకోవడం చాలా పెద్ద అమాయకత్వం. మూర్ఖత్వం. అందుకే మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి" అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. కింగ్ మేకర్‌గా ఎదిగిన విజయ్ పార్టీ..!ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ రికార్డు సృష్టించారు. పూర్తి మెజారిటీ రాకపోయినప్పటికీ.. మొత్తం 234 స్థానాలకు గాను విజయ్‌కి చెందిన టీవీకే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద ఒంటరి పార్టీగా అవతరించింది. ఆ తర్వాత కాంగ్రెస్, మరికొన్ని ప్రాంతీయ పార్టీలతో కొత్త అలయన్స్ ఏర్పాటు చేసిన విజయ్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి.. తనదైన మార్కు పాలన చూపించేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.