
అమెరికాలోని సిన్సినాటి నగరంలో జరిగిన సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. డా. రామినేని ఫౌండేషన్ , సిన్సినాటి తరంగిణి తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన వేదికపై “మోహినీ భస్మాసుర” కూచిపూడి...
అమెరికాలోని సిన్సినాటి నగరంలో జరిగిన సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. డా. రామినేని ఫౌండేషన్ , సిన్సినాటి తరంగిణి తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన వేదికపై “మోహినీ భస్మాసుర” కూచిపూడి నృత్యనాటకం అత్యంత వైభవంగా ప్రదర్శితమైంది. ప్రముఖ కూచిపూడి గురువు, కళారత్న కె.వి. సత్యనారాయణ రచన, నృత్య దర్శకత్వంలో ఈ పౌరాణిక నృత్య రూపకం రూపుదిద్దుకుంది. అమెరికాలోని ఎమరీ థియేటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు సమాజం నుండి భారీ స్పందన లభించింది.
ఈ ప్రదర్శనలో మోహినిగా చదలవాడ శ్రిల హైంధవి, భస్మాసురుడిగా చదలవాడ శ్రీధ వరాళి తమ అద్భుతమైన నటన, హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. వారితో పాటు వంశీ డ్యాన్స్ అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు ఇతర కీలక పాత్రలలో జీవించి, నాటకాన్ని రక్తికట్టించారు. ఈ మొత్తం కార్యక్రమానికి వంశీ చిట్టాజల్లు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, వీక్షకులకు కథాంశాన్ని చక్కగా వివరించారు.
పది రోజుల కఠిన శిక్షణ.. ఈ ప్రతిష్టాత్మక నృత్యనాటకాన్ని వేదికపై విజయవంతంగా ప్రదర్శించడం వెనుక కళాకారుల సుదీర్ఘ శ్రమ దాగి ఉంది. ఇందుకోసం నృత్య దర్శకులు కె.వి. సత్యనారాయణ పది రోజుల పాటు సిన్సినాటి నగరంలోనే ఉండి, స్థానిక కళాకారులకు ప్రత్యేకంగా నృత్య రీతుల్లో శిక్షణ ఇచ్చారు. చిన్న పెద్ద వయసుల తేడా లేకుండా మొత్తం 37 మంది ప్రవాస కళాకారులు ఈ నాటకంలో భాగస్వాములై తమ ప్రతిభను చాటుకున్నారు. శాస్త్రీయ నృత్య శైలిని, పౌరాణిక ఘట్టాలను మేళవించి ప్రదర్శించిన తీరు థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
కళారత్న కె.వి. సత్యనారాయణకు ఘన సన్మానం విజయవంతమైన ప్రదర్శన అనంతరం, కూచిపూడి నృత్యరంగానికి దశాబ్దాలుగా చేస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ప్రముఖులతో కూడిన వేదికపై కళారత్న కె.వి. సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. డా. రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ రామినేని ధర్మాచార్య, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం, డా. చదలవాడ రాజగోపాల్ , చదలవాడ శారదలు ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. విదేశీ గడ్డపై తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని, శాస్త్రీయ నృత్యాన్ని భావి తరాలకు అందిస్తున్న ఇటువంటి ప్రయత్నాలను వారు ఈ సందర్భంగా అభినందించారు.