
నెలసరి సమయంలో ఇప్పటికీ కొన్ని చోట్ల మహిళలపై ఎన్నో ఆంక్షలు, కట్టుబాట్లు.. ఇది ముట్టుకోకూడదు.. అది చేయకూడదు.. అని! ఇలా ఈ సమయాన్ని అపవిత్రంగా భావిస్తుంటారు కొందరు.
కానీ ఇదే నెలసరిని స్త్రీశక్తికి ప్రతీకగా భావిస్తారు అస్సామీయులు.
నెలసరి సమయంలో ఇప్పటికీ కొన్ని చోట్ల మహిళలపై ఎన్నో ఆంక్షలు, కట్టుబాట్లు.. ఇది ముట్టుకోకూడదు.. అది చేయకూడదు.. అని! ఇలా ఈ సమయాన్ని అపవిత్రంగా భావిస్తుంటారు కొందరు. కానీ ఇదే నెలసరిని స్త్రీశక్తికి ప్రతీకగా భావిస్తారు అస్సామీయులు. అక్కడి కామాఖ్యా దేవి ఆలయంలో ఏటా జరిగే ‘అంబుబాచీ మేళా’నే ఇందుకు నిదర్శనం! ఈ ఏడాది జూన్ 22-26 వరకు ఈ మేళాను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు అమ్మవారి గుడిని మూసేస్తారు. అమ్మవారికి రుతుచక్ర సమయంగా భావించే ఈ మూడు రోజుల పాటు అక్కడ వివిధ వృత్తుల్లో ఉండే మహిళలకు వారి విధుల నుంచి విరామం లభిస్తుందట! ఇలా నెలసరి అనేది అపవిత్రమైనది కాదు.. సంతానోత్పత్తికి, స్త్రీ పునరుత్తేజితమవడానికి ప్రతీక అని చాటి చెప్పే ఈ మేళా గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు..
అసోం గువహటిలోని కామాఖ్యా దేవి ఆలయం.. 51 శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా ఎలాంటి విగ్రహం ఉండదట! రాయినే అమ్మవారిగా పూజించడం ఇక్కడి ఆచారం. స్త్రీశక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానోత్పత్తి కలుగుతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
అయితే మహిళలకు నెలసరి వచ్చినట్లు ఇక్కడి కామాఖ్య అమ్మవారికీ ఏడాదికి మూడు రోజుల పాటు రుతుచక్ర సమయంగా భావిస్తారు అస్సామీయులు. దీన్ని ‘అంబుబాచీ మేళా’గా జరుపుకొంటారు. ఈ ఏడాది జూన్ 22-26 వరకు ఈ మేళాను నిర్వహిస్తున్నారు. సాధారణంగా పండగలు, పర్వదినాల్లో ఆలయాల్లోని దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం చూస్తుంటాం. కానీ కామాఖ్య ఆలయం ఇందుకు భిన్నం. ఈ మేళాలో భాగంగా.. ఈ మూడు రోజుల పాటు గుడిని మూసేస్తారు.. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల్ని అనుమతించరు. కానీ ఆలయం బయట భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. రుతుస్రావంలో ఉన్న అమ్మవారు ఈ సమయంలో మరింత శక్తిస్వరూపిణిగా మారతారని, విశ్రాంతితో పునరుత్తేజితమవుతారని స్థానికుల విశ్వాసం. ఇక ఈ మూడు రోజులు అమ్మవారు రుతుచక్రంలో ఉన్నారనడానికి సంకేతంగా.. గుడిని ఆనుకొని ఉన్న బ్రహ్మపుత్ర నదిలోని నీళ్లు ఎరుపెక్కుతాయట! ఇలా మూడు రోజులు ముగిశాక.. మరుసటి రోజు ఉదయం గుడిని శుద్ధి చేసి, అమ్మవారికి మంగళస్నానం చేయించి, ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆపై భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారట!
నెలసరి అనేది అపవిత్రమైనది కాదు.. ఇది మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి, తిరిగి పునరుత్తేజితమవడానికి తగిన సమయం అని చాటిచెప్పడమే ఈ మేళా అంతరార్థం అని చెబుతారు స్థానిక పెద్దలు. ఇందులో భాగంగానే ఈ మూడు రోజుల పాటు అమ్మవారు ఎలాగైతే విశ్రాంతిలో ఉంటారో.. వివిధ వృత్తుల్లో ఉండే ఇక్కడి మహిళలూ తమ విధుల నుంచి విశ్రాంతి తీసుకుంటారట! ఇక మూడు రోజులు పూర్తై గుడి తలుపులు తిరిగి తెరిచాక అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తారు. ఈ సమయంలో ఎర్రటి చిన్న వస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. దీన్ని స్వీకరించడం వారు ఎంతో పవిత్రంగా భావిస్తారని, దీనివల్ల తమకు సంతానోత్పత్తి భాగ్యం కలుగుతుందని నమ్ముతారని అక్కడి వారు చెబుతారు. ఇలా స్త్రీశక్తికి ప్రతీకగా నిలుస్తోంది కామాఖ్య అమ్మవారి దేవాలయం, ఇక్కడ ఏటా నిర్వహించే అంబుబాచీ మేళా.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.