కరవు సీమ రాయలసీమలో బంగారు పంటలు పండనున్నాయి. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గనిగా పేరొందిన.. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ బంగారం ఉత్పత్తికి సిద్ధమైంది.
సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బుధవారం జొన్నగిరి బంగారు గనులు ప్రారంభం కానున్నాయి. కర్నూలు జిల్లా జొన్నగిరితో పాటుగా మరికొన్నిచోట్ల బంగారు నిక్షేపాలను గుర్తించిన నేపథ్యంలో రాబోయే రోజులలో దేశంలోనే అతిపెద్ద బంగారం సరఫరాదారుగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అధికారుల అంచనా. ఇక జొన్నగిరిలో సుమారుగా 50 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఏపీ గనుల శాఖ అంచనా వేస్తోంది. జొన్నగిరితో పాటుగా రామగిరి, జవ్వాకుల, చిగురుకుంట బిస్నాతం ప్రాంతాలలో బంగారు నిక్షేపాలను గుర్తించినట్లు ఏపీ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా చెప్తున్నారు. 1500 ఎకరాల్లో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ .. జొన్నగిరిలో 1500 ఎకరాలను బంగారు గనుల తవ్వకం కోసం పదేళ్ల కిందటే ఏపీ ప్రభుత్వం కేటాయించింది. అయితే కేటాయించిన భూమిలో ఇప్పటివరకు కేవలం 500 ఎకరాల పరిధిలో మాత్రమే బంగారం అన్వేషణ కోసం చర్యలు చేపట్టారు. ఈ 500 ఎకరాలలో 13 టన్నుల వరకు బంగారం ఉండే అవకాశం ఉందని అధికారుల అంచనా. మిగతా వేయి ఎకరాల్లో బంగారాన్ని అన్వేషించే పనులను తర్వాతి దశలో చేపట్టనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయితే.. 1500 ఎకరాలలో నిక్షిప్తమైన 50 టన్నుల బంగారాన్ని వెలికి తీయనున్నారు. గోల్డ్ మైనింగ్ .. ప్రభుత్వాన్ని కాదని ప్రైవేటుకు ఎందుకు..?బంగారు గనుల తవ్వకానికి భారీ పెట్టుబడి, ప్రత్యేక నైపుణ్యం అవసరం ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రైవేట్ సంస్థలకు ఈ బాధ్యతలను అప్పగించింది. అలాగే గత కొన్నేళ్లుగా బంగారం వెలికితీతతో గణనీయమైన తగ్గుదల ఉన్నట్లు ముకేష్ కుమార్ మీనా చెప్తున్నారు. గతంలో ఒక టన్ను మట్టి నుంచి సుమారు మూడు గ్రాముల బంగారం లభించేదని.. ప్రస్తుతం ఆ రేటు టన్నుకు ఒక గ్రాముకు పడిపోయిందంటున్నారు. ఒక టన్ను మట్టి నుంచి లభించే బంగారం పరిమాణం 0.8 గ్రాముల కంటే తక్కువకు పడిపోతే, మైనింగ్ కార్యకలాపాలు లాభదాయకం కాకుండా పోతాయని ముఖేష్ కుమార మీనా వివరించారు. ఇక జొన్నగిరి ప్రాజెక్టును జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించనుంది. ఇందుకోసం 405 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. జొన్నగిరి మైన్ ద్వారా సుమారుగా 700 మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా. వీరిలో 80 శాతం మంది మన రాష్ట్రానికే చెందిన వారు ఉండనున్నారు. జొన్నగిరి బంగారు గనుల నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరంలో 400 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాతి ఏడాది ఉత్పత్తి సామర్థ్యాన్ని 1000 కేజీలకు పెంచుతారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆ తర్వాతి దశలో 2 వేల కేజీలు ( 2 టన్నులు) పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఆదాయమంటే..మరోవైపు జొన్నగిరిలో బంగారం ఉత్పత్తిపై ఏపీ ప్రభుత్వానికి నాలుగు శాతం రాయల్టీ లభిస్తుంది. ఈ లెక్కన మొదటి ఏడాదిలో 400 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేశారనుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.57 కోట్లు రాయల్టీ రూపంలో లభిస్తుంది. అలాగే ఉత్పత్తి 900 కేజీల నుంచి వేయి కేజీల వరకూ ఉన్నప్పుడు రూ.144 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకూ ఏపీ ప్రభుత్వానికి ఆదాయం లభించనుంది. అలాగే స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. లాజిస్టిక్స్, సేవల రంగంలోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.