
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Sai Krishna Case: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్‌కు గురయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వదిలిపెట్టడం లేదు. మరోసారి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. నిందితులను కాపాడడమే లక్ష్యం సిట్ విచారణ జరుగుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే కృష్ణలంక పీఎస్ సీసీ టీవీ ఫుటేజ్‌లు మాయమయ్యాయని తెలిపారు.
గుంటూరు లోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'సీఐ నాగరాజును ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేసు నమోదైన మరుక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలి కదా? సీఐ నాగరాజును అరెస్ట్ చేయకుండా జనసేన అడ్డుకోవడం ఏమిటి? నేరస్తులను నేరస్తులుగానే చూడాలని చెప్పే పవన్ కళ్యాణ్ చేస్తున్నదేమిటి? పోలీసులే నేరస్తులను చంపేస్తుంటే న్యాయస్థానాలు ఉన్నది దేనికి?' అని ప్రశ్నలు కురిపించారు.
'సీఐ నాగరాజుని అరెస్ట్ చేయకపోతే సాక్ష్యాధారాలు మాయం చేస్తాడని చెబుతూనే ఉన్నాం. చివరికి మేం అనుమానించినట్టుగానే ఫుటేజ్‌లు మాయం చేశారు. సీబీఐ విచారణ చేస్తే తప్ప అసలైన నిందితులకు శిక్ష పడదు' అని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు మీద కేసు నమోదు చేసిన మరుక్షణమే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్లలో 18 నెలల పాటు సీసీటీవీ ఫుటేజీలను నిల్వ చేసి ఉంచాలనే నిబంధన ఉల్లంఘించారని తెలిపారు.
'సీఐ నాగరాజును అరెస్ట్ చేసి ఉంటే ఆ ఫుటేజీ మాయమయ్యేదే కాదు. ఒక పద్దతి ప్రకారం పోలీసులను పోలీసులే కాపాడే కుట్రలో భాగంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. లాకప్‌డెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐని కాపాడటానికి ధర్నాలు చేస్తున్న జనసేన నాయకులను ఎందుకు అడ్డుకోలేదు' అని పవన్ కల్యాణ్‌ను మాజీ మంత్రి అంబి రాంబాబు ప్రశ్నించారు. 'సాయికృష్ణను లాకప్‌లో చంపడమే కాకుండా శవాన్ని ఇవ్వకుండా కాల్చేసి బూడిద కూడా దొరక్కుండా మాయం చేయడం, సీసీటీవీ ఫుటేజీలు తుడిచేయడం, ఇలా వరుసపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు సీబీఐ విచారణ చేస్తే తప్ప నిందితులకు శిక్ష పడదని స్పష్టం చేశారు.
'మొదట్నుంచి పోలీస్ కమిషనర్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి మేం చెప్పిందే జరిగింది. కేసు నమోదు చేసిన మరుక్షణమే నేరారోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అరెస్ట్ చేయాల్సింది' అని మాజీ మంతరి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాలి, నేరస్తులను నేరస్తులుగానే చూడాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తాను కచ్చితంగా ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. కాపు యువకుడి లాకప్ డెత్ కు కారణమైన సీఐ నాగరాజును అరెస్ట్ చేయొద్దని జనసేన నాయకులు ధర్నాలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. 'నేరస్తుడికి వంతపాడుతూ జనసేన పార్టీ నాయకులు కల్లు తాగిన కోతులు మాదిరిగా డ్యాన్సులేస్తున్నారు. పోలీసుల అప్రజాస్వామిక విధానాలకు వంతపాడుతున్నారు' అని విమర్శించారు.
సాయికృష్ణ కేసుకి మేకప్ వేసే కార్యక్రమం జరుగుతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు. సాయికృష్ణ కేసులో తూతూమంత్రంగానే సిట్ విచారణ జరుగుతోందని.. కేసు నమోదు చేసిన నాటి నుంచే ఎక్కడా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అంబటి రాంబాబు విమర్శలు చేశారు.