నీట్ 2026 పేపర్ లీక్ వివాదంలో ప్రధానంగా వినిపించిన పేరు టెలిగ్రామ్. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగానే పేపర్ లీక్ జరిగిందంటూ నిఘా సంస్థలు గుర్తించాయి.
దాంతో నీట్ రీ ఎగ్జామ్ ముగిసే వరకూ కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఆ తాత్కాలిక నిషేధం ముగియడంతో మంగళవారం ఉదయం నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో టెలిగ్రామ్ యాప్ తిరిగి అందుబాటులోకి వచ్చింది. నీట్ రీ ఎగ్జామ్ అనంతరం జూన్ 22 అర్ధరాత్రి వరకు టెలిగ్రామ్ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ నిషేధ గడువు ముగియడంతో గూగుల్ టెలిగ్రామ్‌ను తన ప్లాట్ఫామ్లో పునరుద్ధరించింది. అయితే మంగళవారం ఉదయం వరకూ యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రం టెలిగ్రామ్ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం యాప్ అందుబాటులోకి వచ్చినా మెసెజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను జూన్ 30 వరకు నిలిపివేయనున్నారు.టెలిగ్రామ్‌పై కేంద్రం ఎందుకు నిషేధం విధించిందంటే నీట్ పరీక్షకు సంబంధించిన నకిలీ ప్రశ్నాపత్రాలు, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడంలో టెలిగ్రామ్ విఫలమైందంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం నీట్ రీ ఎగ్జామ్ సజావుగా సాగాలంటే టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా బ్యాన్ చేయాలని నిర్ణయించింది. యాప్‌ను తాత్కాలికంగా బ్యాన్ చేసే విషయమై జూన్ 3వ తేదీనే టెలిగ్రామ్ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. ఆ తర్వాత టెలిగ్రామ్‌తో పాటు దాని వెబ్ వర్షన్, దానికి సంబంధించిన లింకులు అన్నింటినీ జూన్ 22 వరకు బ్లాక్ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెలిగ్రామ్ యాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ, ఢిల్లీ హైకోర్టు కూడా టెలిగ్రామ్‌కు షాక్ ఇస్తూ కేంద్రం నిర్ణయాన్నే అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారంపై టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురోవ్ భారత ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు. కొందరు వినియోగదారులు పరీక్ష ప్రశ్నపత్రాలు షేర్ చేశారనే కారణంగా.. మొత్తం యాప్‌ను నిషేధించడం సరైన నిర్ణయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా యాప్‌పై ఆంక్షలు తీసుకోక తప్పలేదు.