
ఏపీ రాజకీయాల్లో మరో వివాదం రేగింది. పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టి తవ్వకాలలో దాదాపు 350 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ అక్రమ మట్టి తవ్వకాలు, బినామీ నెట్‌వర్క్, మనీలాండరింగ్ కార్యకలాపాలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాశారు. మూడు పేజీల సుదీర్ఘ లేఖ ఇది.పోలవరం కుడి ప్రధాన కాలువతో పాటు బుడమేరు డైవర్షన్ ఛానల్ పరిధిలో జరిగిన ఈ భారీ కుంభకోణం వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రమేయం ఉందని ఆరోపించారు నాని. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుస్తూ, ప్రజా వనరులను నిలువునా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సిండికేట్‌పై పీఎంఎల్‌ఏ కింద దర్యాప్తు జరపాలని కోరారు. ఈ భారీ మట్టి దోపిడీ వెనుక బలమైన రాజకీయ, అధికారుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు.ప్రధాన కాలువ కట్టలను ధ్వంసం చేస్తూ సాగిన ఈ దందా విలువ దాదాపు 350 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని కేశినేని నాని అంచనా వేశారు. ఈ అక్రమ నిధుల మళ్లింపు వెనుక ఉన్న అసలైన లబ్ధిదారులను, వారి అనుచరులను చట్టం ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మైనింగ్, నీటిపారుదల శాఖల నుంచి తొలుత ఖాన్ అనే వ్యక్తి 167.040 కిలోమీటర్ల మైలు రాయి వద్ద కేవలం 5,000 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తవ్వుకోవడానికి అనుమతి తీసుకున్నారని, దీన్ని అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున లూటీ చేయడానికి ఒక వ్యవస్థీకృత సిండికేట్ ఏర్పాటయిందని ఆయన లేఖలో స్పష్టం చేశారు.ఇందులో మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున్‌, ఎంపీ కేశినేని చిన్ని జోక్యం చేసుకోవడంతో పరిమిత అనుమతి కాస్తా అపరిమితమైన దోపిడీ సామ్రాజ్యంగా మారిందని ఆరోపించారు. ఏకంగా 2,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని అక్రమంగా తవ్వడం వల్ల పోలవరం కుడి కాలువ గట్లను పూర్తిగా దెబ్బతీన్నదని లేఖలో పేర్కొన్నారు. ఈ అక్రమ తవ్వకాల క్షేత్రస్థాయి నిర్వహణ బాధ్యతలను ఎంపీ ప్రధాన అనుచరులైన ముల్పూరి కిషోర్, దాసరి జగదీష్, పోలవరపు సుకుమార్, పోలవరపు కళ్యాణ్ చూసుకున్నారని ఆరోపించారు.రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో కట్టలను తొలిచేసి, ఎలాంటి వే బిల్లులు కానీ, మైనింగ్ పాస్‌లు కానీ లేకుండా రవాణాదారులైన చిట్టిబాబు, బుడ్డి సహాయంతో ఈ మట్టిని అమరావతిలోని ప్రైవేటు కాంట్రాక్టర్లకు విక్రయించారని ఆరోపించారు. ఈ భారీ అక్రమ మట్టి వ్యాపారం ద్వారా లభించిన కోట్ల రూపాయల లావాదేవీలు ఒక రహస్య కార్యాలయం నుంచి సాగాయని కేశినేని నాని ఆరోపించారు.భారత్ వైఖరిని తేల్చి చెప్పిన అజిత్ దోవల్ ఈ అక్రమ కలెక్షన్లకు సంబంధించిన నగదు మొత్తాన్ని ఎంపీ కేశినేని చిన్ని వ్యక్తిగత క్యాషియర్ రమేష్ పర్యవేక్షించారని లేఖలో పేర్కొన్నారు. ఈ నల్లధనాన్ని వివిధ ప్రైవేటు ప్రాజెక్టులలోకి, బినామీ ఖాతాల్లోకి మళ్లించడం ద్వారా అక్రమ నగదు చలామణి నెట్‌వర్క్ నడిపిస్తున్నారని ఆరోపించారు. గుణదల గురునానక్ కాలనీలోని రావూరి విస్టా అపార్ట్ మెంట్ ఫ్లాట్‌ నంబర్ 301పై తక్షణమే దాడులు నిర్వహించి అక్కడి సీసీటీవీ దృశ్యాలను, ఆర్థిక రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ అక్రమ తవ్వకాలపై ప్రశ్నించిన కొత్తూరు తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త జమాలయ్యపై ఈ ముఠా భౌతిక దాడులు, బెదిరింపులకు పాల్పడిందని నాని స్పష్టం చేశారు. మార్చి 5వ తేదీన ప్రజా వ్యతిరేకతతో అధికారులు మట్టి తవ్వకాల అనుమతులను రద్దు చేసినప్పటికీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా స్థానిక రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ఏప్రిల్ చివరి వారం వరకు ఈ దోపిడీని కొనసాగించేలా చూశాయని ఆరోపించారు.