
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోదశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తున్న కడప జిల్లా, మరీ ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది.
2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనానికి వైసీపీ కోటలు ఎక్కడికక్కడ బద్దలయ్యాయి, బీటలు వారాయి. రాయలసీమ వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు అఖండ విజయాలు సాధించారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఘోర పరాజయం ఎదురైనా, కడప కోట బీటలు వారినా.. పులివెందుల మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడింది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు పులివెందులలో ఏకంగా 90,000 ఓట్ల భారీ మెజారిటీ వచ్చింది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆ మెజారిటీ 30 వేలు తగ్గి 60,000 ఓట్లకు పడిపోయింది. ఈ గణాంకాలను ఆధారంగా చేసుకుని ఇప్పుడు జనసేన పార్టీ నేతలు వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో విమర్శల దాడిని ప్రారంభించారు. పులివెందుల దాటితే జగన్ చెల్లని రూపాయితో సమానమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు పంతం నానాజీ జగన్ కు విసిరిన సవాల్ ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. పులివెందుల అనే సేఫ్ జోన్ దాటి బయటకు వచ్చి, తన నిజమైన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని ఆయన జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే పులివెందుల వదిలి, బయటకు రా జగన్.. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి చూపితే, నిజమైన నాయకుడిగా అందరూ గుర్తిస్తారని పంతం నానాజీ జగన్ కు సవాల్ విసిరారు. . పులివెందుల దాటి బయట గెలవనంత కాలం రాజకీయాల్లో సెకండ్ గ్రేడ్ లీడర్‌గానే మిగిలిపోతారంటూజగన్ పై విమర్శలు గుప్పించారు. భీమవరం, గాజువాకల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కేవలం కాపు సామాజికవర్గ సమీకరణాలను వాడుకుని గెలిచారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా జనసేన ఈ స్థాయిలో రిటార్డ్ ఇచ్చింది.
ఈ సవాల్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. జగన్ ఎప్పుడూ తన సొంత నియోజకవర్గం మినహా వేరే ఎక్కడా పోటీ చేసే ధైర్యం చేయలేదంటూ నెటటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. సమకాలీన రాజకీయాల్లో నారా లోకేష్ మంగళగిరి లాంటి క్లిష్టమైన స్థానాన్ని ఎంచుకుని గెలిచారని, పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో నిలబడి గెలిచి చూపించారని, మరి జగన్ ఎందుకు ఎప్పుడూ పులివెందులకే పరిమితం అవుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. పంతం నానాజీ సవాల్ విసరడంతో పాటు జగన్ పై అభ్యంతరకర పదాలను వాడటంపై కూడా నెటిజనులు తప్పుపడుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి అనుచిత, అభ్యంతరకర భాషను స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సమర్థించరంటున్నారు. అది పక్కన పెడితే పులివెందుల వదిలి బయటకు రా జగన్ అన్న సవాల్ మాత్రం రాజకీయ హీట్ ను అమాంతంగా పెంచేసింది. పులివెందుల కోటలో మెజారిటీ తగ్గడం, ఇప్పుడు జనసేన ఏకంగా నియోజకవర్గం దాటి రావాలని ఛాలెంజ్ చేయడం వైసీపీని ఒక్కసారిగా డిఫెన్స్ లో పడేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
TG20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ విధ్వంసం.. నల్గొండ నైట్స్‌పై కిరాక్ విక్టరీ!
రైతులకు గుడ్ న్యూస్: ఒకే విడతలో రైతు భరోసా నిధులు!
.