
సూర్య ప్రకాష్ జోశ్యుల Rating: 2.5 అనగనగా ఓ సుబ్బారావు అలియాస్ సుబ్బు (చంద్రహాస్). ఉద్యోగం, సద్యోగం లేనివాడు. తండ్రి నుంచి అప్పులను వారసత్వంగా అందుకున్న అదృష్టవంతుడు.
---సూర్య ప్రకాష్ జోశ్యుల Rating: 2.5 అనగనగా ఓ సుబ్బారావు అలియాస్ సుబ్బు (చంద్రహాస్). ఉద్యోగం, సద్యోగం లేనివాడు. తండ్రి నుంచి అప్పులను వారసత్వంగా అందుకున్న అదృష్టవంతుడు. దాంతో ఎలా బ్రతకాలిరా అని తలపట్టుకుంటే...స్నేహితుడు పండు "కొచ్చికి రా... ఏదో ఒక పని చూద్దాం" అని పిలుస్తాడు. దాంతో స్నేహమేరా జీవితం అనుకుంటూ కేరళలోని కొచ్చిలో వాలిపోతాడు. అక్కడ బోట్ హౌస్‌లో బస చేస్తూ, టాక్సీ డ్రైవర్‌గా రోజులు నెట్టుకొస్తుంటాడు. అలా జీవితం అర్దమయ్యి..కాకుండా నడుస్తున్న సమయంలో ఓ శుభ ముహూర్తాన అమెరికా నుంచి వైష్ణవి (లావణ్య) అనే అందమైన అమ్మాయి బిజినెస్ పని మీద కొచ్చిలో దిగుతుంది. నెల రోజుల పాటు తిరగడానికి సుబ్బు టాక్సీని బుక్ చేసుకుంటుంది. ఇక మనోడికి లాటరీ తగిలిన ఫీలింగ్. రోజూ ఆమెతో తిరుగుతూ, ఆమె నవ్వులకు అర్థాలు వెతుకుతూ, ఆమె మర్యాదను ప్రేమగా అపార్థం చేసుకుంటూ గాల్లో మేడలు కట్టడం మొదలుపెడతాడు. అమ్మాయి రెండు మాటలు బాగా మాట్లాడితే పెళ్లి కార్డు ప్రింట్ చేయించుకునే సగటు తెలుగు కుర్రాడు జాతికి చెందినవాడు కదా! అయితే ప్రేమ కథలకు ట్విస్ట్‌లు పెట్టడానికి విధి(అదే రైటర్) ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అమెరికా నుంచే రోహిత్ అనే కుర్రాడు ఎంట్రీ ఇస్తాడు. అతడే వైష్ణవి కాబోయే భర్త అని తెలిసేసరికి, సుబ్బు ప్రేమ బుడగ సూదితో పొడిచిన బెలూన్లా టప్మని పేలిపోతుంది. అప్పుల బాధ ఒకవైపు... ప్రేమ బాధ మరోవైపు... జీవితమే తనను పనిగట్టుకుని మరీ ట్రోల్ చేస్తోందేమో అనుకునే పరిస్థితి. ఇంతలో కథ మరో టర్న్ తీసుకుంటుంది. ఒక రోజు రన్నింగ్ ట్రైన్లో నలుగురు దుండగులు ఓ అమ్మాయిని బయటకు తోసేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యం అనుకోకుండా వైష్ణవి సెల్ఫోన్లో రికార్డ్ అవుతుంది. సాధారణంగా మనలో చాలామంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసి తమ బాధ్యత పూర్తయిందనుకుంటారు. కానీ వైష్ణవి అలా కాదు. "ఆ అమ్మాయికి ఏమైంది? ఎలా సేవ్ చేయాలి" అని నడుం బిగిస్తుంది. అసలా ఆ యువతి ఎవరు? ఆమె బతికే ఉందా? ఆ నలుగురు ఎవరు? వాళ్లు ఆమెను ఎందుకు టార్గెట్ చేశారు? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకాలని నిర్ణయించుకుంటుంది. బిజినెస్ డీల్ కంటే ఈ మిస్టరీ డీల్‌నే సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ అన్వేషణలో ఆమెకు తోడుగా నిలుస్తాడు మన సుబ్బు. ఇద్దరూ కలిసి ఆ యువతి ఆచూకీ కోసం, నిజం కోసం, న్యాయం చేయటం కోసం తిరుగుతారు. ఆ క్రమంలో ఊహించని ప్రమాదాలు, కొత్త నిజాలు, షాకింగ్ మలుపులు ఎదురవుతాయి. మరో ప్రక్క ఆమె కోసం అమెరికా నుంచి వచ్చిన రోహిత్ కు ఇలాంటివి గిట్టవు.గిట్టుబాటు అయ్యే పనులు కావు అని నమ్మకం. దాంతో అంటీ ముట్టనట్లుగా ఉంటాడు. అలాంటి సమయంలో సుబ్బు ...ఆమెకు అల్లుకుపోగలిగాడా...చివరకు ఏమైంది... ఆ యువతి ఆచూకీ దొరుకుతుందా? దోషులు పట్టుబడతారా? వైష్ణవి ప్రయత్నం ఫలిస్తుందా? రోహిత్ ఏమయ్యాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ "కామెడీ క్రైమ్ థ్రిల్లర్" వినడానికి సింపుల్‌గా అనిపించినా, రాయడానికి అత్యంత కష్టమైన జానర్లలో ఇదొకటి.ఎందుకంటే ఇలాంటి కథలో ఏం చెప్పారన్నది కాదు... ఎప్పుడు చెప్పారు? ఎలా చెప్పారు? అనేదే అసలైన గేమ్. ఈ సినిమా కూడా అదే గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తుంది. ఆటలో గెలిచిందా... మూడు ట్రాక్‌లు... ఒకే ట్రైన్ ఈ కథలో మూడు ట్రాక్ లు సమాంతరంగా నడుస్తుంటాయి. అప్పుల నుంచి తప్పించుకోవడానికి కొచ్చికి వచ్చిన సుబ్బారావు. ఎంగేజ్మెంట్ అయ్యి, హోటల్ బిజినెస్ కోసం వచ్చిన వైష్ణవి - రోహిత్. ట్రైన్లో ప్రమాదంలో పడిన యువతి మిస్టరీ. స్క్రీన్‌ప్లే పరంగా చూస్తే ఇవి మూడు వేర్వేరు కథల్లా అనిపించే అంశాలు. మొదటి 30-40 నిమిషాలు సినిమా ఒక రోడ్ ట్రిప్ లవ్ స్టోరీలా సాగుతుంది. ఆ తర్వాత రోహిత్ ఎంట్రీతో లవ్ ట్రయాంగిల్ కామెడీగా మారుతుంది. మళ్లీ ట్రైన్ ఘటన తర్వాత ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అవుతుంది. ఇక్కడే దర్శకుడి బలం కూడా ఉంది, బలహీనత కూడా ఉంది. ఎందుకంటే ప్రేక్షకుడు ఒక జానర్‌కు అలవాటు పడేలోపే మరో జానర్లోకి షిప్ట్ అయ్యి వెళ్లిపోతాడు.అయితే దర్శకుడు ఈ కష్టాన్ని చూసేవారికి ఇబ్బంది కలగకుండా దాటటానికి ప్రయత్నించాడు. అలాగే కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌లో మూడు అంశాలు తప్పనిసరిగా ఉంటాయి.ప్రమాదం, ఫన్, మిస్టరీ. ఈ మూడు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఎక్కువ కామెడీ పెడితే థ్రిల్లర్ చనిపోతుంది.ఎక్కువ థ్రిల్లర్ పెడితే కామెడీ పనిచేయదు.రెండు ఒకదానికొకటి సింక్ కానివి. కానీ వాటిని బ్యాలెన్స్ చేసి సింక్ చేస్తేనే మజా. ఆ యాంగిల్ లో చాలావరకూ సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అయితే స్క్రీన్‌ప్లే అక్కడక్కడా తబడుతూంటుంది. ఇక్కడ Robert McKee చెప్పిన ఒక సూత్రం గుర్తుకు వస్తుంది. "A story progresses through conflict." అంటే కథ ముందుకు వెళ్లాలంటే సంఘర్షణ పెరుగుతూనే ఉండాలి. కానీ ఈ సినిమాలో లవ్ ట్రాక్ ప్రెడిక్టబుల్‌గా నడుస్తుంది. దాంతో ఆ సీన్స్ సర్ప్రైజ్ ఇవ్వలేవు.సరదాగానూ అనిపించలేదు. అయితే కథ ఇది కాదులే అని క్రైమ్ కోసం వెయిట్ చేస్తూంటాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. ఇక మిస్టరీ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. ఎందుకంటే ఈ ట్రాక్ లో బోలెడు ప్రశ్నలు ఉన్నాయి.అసలు ఆ ట్రైన్ లో ప్రమాదంలో కనపడిన ఆ అమ్మాయి ఎవరు? ఆమెకు ఏమైంది? ఆ నలుగురు ఎవరు? వాళ్ల ఉద్దేశం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మనని కట్టిపారేసి, ఇప్పటిదాకా చూసింది ఇక చాల్లే అని టీవి కట్టేయకుండా ఆపుతాయి. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో నాకు సమస్యగా అనిపించింది ఒకటే. ఈ కథలో అసలు హీరో ఎవరు సుబ్బా? లేక వైష్ణవి? ఈ ప్రశ్న చాలా సార్లు వస్తుంది. ఎందుకంటే కథలో అత్యంత యాక్టివ్ పాత్ర వైష్ణవి. మిస్టరీని ఛేజ్ చేసేది ఆమె. నిర్ణయాలు తీసుకునేది ఆమె. కేసును ముందుకు నడిపేది కూడా ఆమె. సుబ్బు ఎక్కువగా ఆమె వెంట వెళ్లే పాత్రగానే కనిపిస్తాడు. దీంతో హీరో సెంట్రిక్ కథలా మొదలై హీరోయిన్ డ్రివెన్ కథగా మారుతుంది. క్లైమాక్స్ ఎందుకు వర్కవుట్ అయ్యింది? ఎందుకంటే దర్శకుడు చివరి వరకు ఒక ప్రశ్నను దాచిపెడతాడు. మంచి థ్రిల్లర్‌లో క్లైమాక్స్ అనేది కొత్త కథ కాదు. ఇప్పటికే చూసిన కథకు కొత్త అర్థం ఇవ్వాలి. ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ అదే పని చేస్తుంది. అందుకే సెకండాఫ్ కొంచెం బలంగా అనిపిస్తుంది. విలన్ బలహీనం యాక్షన్ సినిమా కాదు కదా అని విలన్ పాత్రను బలహీనంగా రాసుకున్నట్లున్నారు. విలన్ ఎవరో తెలిసిన కాసేపటికే క్లైమాక్స్ వచ్చి ముగింపుకు వచ్చేసింది.అలాగే ఎండ్ ట్విస్ట్ హీరో ఓ డైలాగుతో ముగించారు. అదే విజువల్ గా చూపెడితే మరింత స్ట్రాంగ్ గా ఉండేది. దర్శకుడు ఇంకాస్త రిస్క్ తీసుకుని ఉంటే? ఇక్కడ Quentin Tarantino స్టైల్ గుర్తుకు వస్తుంది. టరంటినో కథల్లో ప్రేక్షకుడు తర్వాత ఏం జరుగుతుందో ఎప్పుడూ చెప్పలేడు. ఈ సినిమాలో ప్రేమ ట్రాక్ కూడా అంతే అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటే... లేదా రోహిత్ పాత్రలో ఇంకాస్త గ్రే షేడ్స్ పెట్టి ఉంటే... లేదా మిస్టరీని ఇంకా ముందుగానే కథలోకి తెచ్చి ఉంటే...సినిమా మరింత ఎంగేజింగ్ అయ్యేదేమో. దర్శకుడు చేసిన మంచి నిర్ణయం చాలా మంది దర్శకులు ఇలాంటి కథల్లో హీరో ప్రేమకథనే ప్రధాన ట్రాక్ చేస్తారు. కానీ ఇక్కడ దర్శకుడు మధ్యలోనే ప్రేమ ట్రాక్‌ను సైడ్ చేసి, మిస్టరీకి స్టీరింగ్ అప్పగించాడు. అది సరైన నిర్ణయమే.ఎందుకంటే ప్రేమకథలో కొత్తదనం లేదు. కానీ మిస్టరీ ట్రాక్‌లో కుతూహలం ఉంది. టెక్నికల్ గా .. దర్శకుడు చందు ముద్దు..గత చిత్రాలకు దీనికి చాలా పరిణితి కనిపిస్తుంది. ఓ మళయాళ కామిడీ థ్రిల్లర్ చూసినట్లు అనిపించేలా డిజైన్ చేసారు. అలాగే ఈ సినిమా కు పెద్ద ప్లస్ .. కేరళ బ్యాక్‌డ్రాప్ . చాలా తెలుగు సినిమాల్లో లొకేషన్ కేవలం బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే. కానీ ఇక్కడ బోట్ హౌస్‌లు, బ్యాక్ వాటర్స్, రోడ్డు ప్రయాణాలు కథలో భాగమవుతాయి.అవి బాగా ప్లాన్ చేసారు. డైలాగులు ఎప్పటిలాగే ఫన్నిగా బాగా రాశారు దర్శకుడు. ఇక ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ కెమెరా వర్క్. ప్రిన్స్ హేన్రి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. వెంకట్ ప్రభు ఎడిటింగ్ సినిమాకు కలిసి వచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చిన్న సినిమాకు పెద్ద లుక్ ని ఇచ్చాయి. నటీనటుల్లో దాదాపు అందరూ కొత్తవారైనా మనకు అలవాటు లేని మొహాలే అయినా, బాగా నటించారు. హీరో చంద్రహాస్ ... 'RX 100' హీరో కార్తికేయ లా అనిపిస్తారు. అతని పొడుగు మీద డైరెక్టర్స్ కొన్ని జోక్స్ కూడా కట్ చేసారు డైలాగుల్లో. ఫైనల్ థాట్ ఈ ,సినిమాలో దర్శకుడు ప్రేక్షకుడిని నవ్విస్తూ, మధ్యలో మిస్టరీలోకి లాక్కెళ్లే ప్రయత్నంలో చాలావరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కానీ గొప్ప కామెడీ క్రైమ్ థ్రిల్లర్లు చేసే పని మాత్రం ఇంకొంచెం మిగిలిపోయింది. అదేమిటంటే గొప్ప కామెడీ థ్రిల్లర్‌లో ప్రేక్షకుడు నవ్వుతూ టెన్షన్ పడాలి. ఈ సినిమాలో ప్రేక్షకుడు నవ్వుతాడు... ఆసక్తిగా చూస్తాడు... కానీ చాలా అరుదుగా మాత్రమే టెన్షన్ పడతాడు. కాబట్టి ఇదో "లైట్ వెయిట్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్" . చూడచ్చా కాలక్షేపానికి లోటు లేదు..అక్కడక్కడా నవ్వుకుంటూ, మిస్టరీ ఎలిమెంట్స్ ని ఎంజాయ్ చేస్తూ సరదాగా చూసేయచ్చు ఎక్కడ చూడచ్చు ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది