గవర్నమెంట్ స్కూల్ అంటేనే చాలా మంది తమ పిల్లలను చేర్పించడం లేదు. ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లలో రూ.లక్షలు చెల్లించి.. తమ పిల్లలకు చదివిస్తున్నారు.
కూలీ, నాలీ చేసుకునే పేదలు కూడా తమ స్థాయిని మించి ఖర్చు చేసి ప్రైవేటుకు పంపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని ప్రచారాలు చేసినా అవి నామమాత్రంగానే మారాయి. అయితే ఎక్కడో ఒకచోట ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపించి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ.. అది పూర్తి స్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఓ ఉపాధ్యాయుడు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. మూతపడే పరిస్థితికి చేరుకున్న పాఠశాలను మళ్లీ పిల్లల కేరింతలతో నింపాలనే లక్ష్యంతో తన సొంత జీతం నుంచే విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున అందిస్తానని ప్రకటించారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం లింగా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. గత కొన్నేళ్లుగా విద్యార్థులు లేక మూతపడి ఉన్న ఆ స్కూల్లో ఎవరూ చేరకపోవడంతో.. దాన్ని ప్రస్తుత విద్యాసంవత్సరంలో దాన్ని తిరిగి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అయితే పాఠశాల తెరవాలంటే కనీసం విద్యార్థుల నమోదు అవసరం కావడంతో.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బిజ్జుర్వార్ సాయినాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరే ప్రతి విద్యార్థికి నెలకు రూ.వెయ్యి చొప్పున తన జీతం నుంచి ఇస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన కాస్తా ఆ గ్రామస్తులకు ఒక ఆలోచనను కలిగించింది. పాఠశాలలో ఇప్పటివరకు ముగ్గురు విద్యార్థులు చేరినట్లు తెలుస్తోంది. గతంలో ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలకు ఇప్పుడు అడ్మిషన్లు రావడం ఉపాధ్యాయుడి ప్రయత్నానికి తొలి ఫలితంగా భావిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల ప్రభావం, వలసలు, గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ పాఠశాలలపై కొందరిలో ఉన్న అపోహలు వంటి కారణాలతో అనేక గ్రామాల్లో ప్రభుత్వ బడుల్లో నమోదు తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో సాయినాథ్ తీసుకున్న నిర్ణయం కేవలం ఆర్థిక ప్రోత్సాహకంగా కాకుండా, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచే ప్రయత్నంగా కనిపిస్తోంది.అయితే కొందరు గ్రామస్థులు చిన్నారులకు చదువుకునే దశలోనే వేతనం ఇవ్వడం సరైందా అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాలు మాత్రం పాఠశాలను కాపాడుకోవడానికి, పిల్లలను విద్యకు చేరువ చేయడానికి ఇది తాత్కాలిక ప్రోత్సాహక చర్యగా చూడాలని అభిప్రాయపడుతున్నాయి. ఒక ఉపాధ్యాయుడు తన జీతాన్ని వెచ్చించి పాఠశాల పునరుద్ధరణకు ముందుకు రావడం ప్రశంసనీయమని గ్రామస్థులు చెబుతున్నారు. లింగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మళ్లీ పూర్తి స్థాయిలో నడవాలని, మరింత మంది పిల్లలు చేరాలని గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు.