జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న రవాణా శాఖ అధికారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఆయన స్పాట్‌లోని ప్రాణాలు విడిచారు. డీటీఓ వెంకన్న .. రోడ్డుపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా.
. అటుగా శరవేగంగా దూసుకొచ్చిన లారీ ఒక్కసారిగా ఢీకొట్టి, అతడి పైనుంచి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులో ఉన్న ఆర్టీవో కార్యాలయం ఎదుట.. సోమవారం ఉదయం పరకాల - భూపాలపల్లి జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. డీటీఓ వెంకన్న తనిఖీలు చేస్తుండగానే.. లారీ ఢీకొట్టడంతో చనిపోయారు. అయితే గతంలో వేరే దగ్గర పనిచేసిన వెంకన్న.. 15 రోజుల క్రితమే బదిలీ మీద భూపాలపల్లికి వచ్చారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన జరగడం తీవ్రంగా కలిచివేస్తోంది. వేగంగా వచ్చిన లారీ అతడిపైకి దూసుకెళ్లడంతో డీటీఓ వెంకన్న మృతదేహం నుజ్జు నుజ్జు అయిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. డీటీఓ వెంకన్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది. ఇక లారీ డ్రైవర్‌ను పోలీసులు విచారణ చేయనున్నారు. ఇది ప్రమాదమేనా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.మరోవైపు.. ఈ ఘటనపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. డీటీఓ వెంకన్న కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. విధి నిర్వహణలో డీటీఓ వెంకన్న చనిపోవడం తీవ్ర బాధాకరం అని పేర్కొన్నారు. డీటీఓ వెంకన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భూపాలపల్లి డీటీఓ వెంకన్న మృతి పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని.. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్‌ను రేవంత్ రెడ్డి ఆదేశించారు.